వేసవిలో మంచి నీటి సమస్య లేకుండా చూస్తాం

20 Mar, 2021 16:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో డివిజన్ల వారీగా ప్రాధాన్యతలను బట్టి ఆయా పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేశామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. వేసవిలో మంచి నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. శనివారం పశ్చిమ నియోజకవర్గం కార్పోరేటర్లు, మున్సిపల్ అధికారులతో మంత్రి వెల్లంపల్లి సమీక్ష నిర్వహించారు.  నగరాభివృద్ది, ప్రజాసమస్యలపై ప్రణాళికలపై చర్చించారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మత్తులపై పనులు ప్రారంభించాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు ఎల్‌.అండ్.టీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. రోడ్ల మరమ్మత్తుల పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికైన కార్పోరేటర్లందరూ  తొలిసారిగా అధికారులతో సమావేశం  అయ్యాం. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి కృషి చేస్తాం. ముఖ్యంగా వేసవిలో మంచినీటి సమస్య లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం’’ అని అన్నారు.

మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘ శానిటేషన్, తాగు నీటి సమస్య, రోడ్లు వంటి వాటిపై అన్ని అంశాలను వివరించాం. దీనిపై కౌన్సిల్లో కూడా చర్చించి త్వరలోనే అన్ని పనులు ప్రారంభించి, సకాలంలో పూర్తి చేసేలా చూస్తాం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు