ఏపీలో సోలార్‌ ప్రాజెక్టు పెడతాం

12 Mar, 2023 04:06 IST|Sakshi

‘సాక్షి’తో నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ ప్రసన్నకుమార్‌

సాక్షి ప్రతినిధి: ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీ.. పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇక్కడి పాలకులు అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో రూ. 9,57,139 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టుల ద్వారా 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ వేదికగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఆ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా (ఎన్‌ఎల్‌సీఐ) లిమిటెడ్‌ కూడా చేరింది. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించడానికి ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఎన్‌ఎల్‌సీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ప్రసన్నకుమార్‌ మోటుపల్లి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

పునరుత్పాదక విద్యుత్‌కు  ఏపీలో అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ‘నైవేలీ’ సిద్ధంగా ఉంది. పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్‌ ఎనర్జీ) విభాగంలో.. ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే మా కార్పొరేషన్‌ లక్ష్యం.

ఇందుకు అనుకూలమైన రాష్ట్రాలేమిటని చూసినప్పుడు మాకు మొదట ఏపీ కనిపించింది. దీంతో వెంటనే ప్రభుత్వానికి మేం ప్రతిపాదించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో భేటీ అయ్యాం. రాష్ట్రంలో ఎన్‌ఎల్‌సీ విస్తరణ, పవర్‌ ప్రాజెక్ట్‌లు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యంత సానుకూల వాతావరణం కనిపించింది.

లిగ్నైట్‌ ద్వారా విద్యుదుత్పత్తి..
లిగ్నైట్‌ (గోధుమ బొగ్గు) ద్వారా విద్యుదుత్పత్తి చేయడం మా కార్పొరేషన్‌ ప్రత్యేకత. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో మాత్రమే ఈ బ్రౌన్‌ కోల్‌ అందుబాటులో ఉంది.

ఎన్‌ఎల్‌సీఐ ద్వారా లిగ్నైట్‌ మైనింగ్‌ చేసి నైవేలీలోనే విద్యుదుత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ 8 వేల మెగావాట్లు కాగా అందులో థర్మల్‌ పవర్‌ 6 వేల మెగావాట్లు ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకి కార్పొరేషన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కి దాదాపు 310 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. 

ఏపీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో..
దేశంలోనే తొలిసారిగా నైవేలీలో రూ.12 వేల కోట్లతో 1,320 మెగావాట్ల లిగ్నైట్‌ అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్లాంట్‌ని ఏర్పాటు­చే­యబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రం తాలబిరలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ని నిర్మించబోతున్నాం. అన్నీ అను­కూలిస్తే ఏపీలో రూ.3 వేల కోట్లతో 500–1000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం.

రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు నచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. 2025­లోగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగితే ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీల నుంచి కూడా కేంద్రం ద్వారా మిన­హాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టువల్ల ప్రత్య­క్షం­గా 200 మందికి పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

విద్యు­త్‌ కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) లిమిటెడ్‌తో ఏపీ ఇప్పటికే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ పొందడానికి ఒప్పందం చేసుకుంది. వారి ధర యూనిట్‌ రూ.2.49గా నిర్ణయించారు. మేం కూడా ఇంచుమించు అదే ధరకు సౌర విద్యుత్‌ను అందిస్తాం. 
 

మరిన్ని వార్తలు