విస్తరిస్తున్న అల్పపీడనం.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

15 Oct, 2021 08:29 IST|Sakshi

ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

సాక్షి ,మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది. అల్పపీడనం కారణంగా గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్లు వంగి ఉంది. అలాగే తూర్పు–పడమర ద్రోణి సగటు సముద్రమట్టం కంటే 4.5, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉంది. ఇప్పుడు అల్పపీడనానికి సంబంధించి ఉపరితల ఆవర్తనం గుండా వెళుతోంది. ఇది లక్షద్వీప్‌ ప్రాంతం, ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రం మధ్య బంగాళాఖాతం ఉత్తర భాగంలో ఉన్న ఇతర అల్పపీడనం ప్రాంతంతో సంబంధం కలిగి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. 

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

చదవండి: ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు!

మరిన్ని వార్తలు