VZM Mobile Tracker Web Portal: మొబైల్‌ మిస్సయ్యిందా..? జస్ట్‌ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్‌ సేఫ్‌!

19 Aug, 2022 17:48 IST|Sakshi

విజయనగరం క్రైమ్‌: మొబైల్‌ మిస్సయిందా..? ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే విషయాలను వివరిస్తూ, వాటి ఐఎంఈఐ నంబర్లు, అడ్రస్, కాంటాక్టు నంబర్‌తో వెబ్‌పోర్టల్‌లో ఫిర్యాదుచేస్తే చాలు.. విజయనగరం జిల్లా సైబర్‌ పోలీసులు ట్రాక్‌చేస్తారు. ఆ మొబైల్స్‌ను ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ సదుపాయం విజయనగరం జిల్లా ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
చదవండి: డిలీట్‌.. డిలీట్‌.. డిలీట్‌... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు

ఎస్పీ దీపికాఎం.పాటిల్‌ సూచనల మేరకు ఫిర్యాదుదారులు సులభంగా ఫిర్యాదు చేసుకునేలా విశాఖపట్నం దువ్వాడ విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఫర్‌ ఉమెన్‌ కళాశాలలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన విద్యార్థినులు రూపొందించిన ‘వీజెడ్‌ఎమ్‌మొబైల్‌ట్రాకర్‌ డాట్‌ ఇన్‌’ను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు.

రూ.16.54లక్షల విలువైన మొబైల్స్‌ స్వాధీనం..  
జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను ట్రేస్‌ చేసేందుకు గత నెలలో ఎస్పీ దీపిక వాట్సాప్‌ నంబర్‌ 89779 45606ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనికి చాలామంది బాధితులు ఫిర్యాదు చేశారు. నెలల వ్యవధిలోనే రూ.16.54లక్షల విలువైన 103 ఫోన్‌లను సైబర్‌ పోలీసులు ట్రేస్‌ చేశారు. తెలంగాణ, ఛత్తీగఢ్, ఒడిశా, బీమార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎస్పీ కార్యాలయంలో బాధితులకు గురువారం అందజేశారు.

మొబైల్స్‌ రికవరీ చేయడంలో శ్రమించిన సైబర్‌సెల్‌ ఎస్‌ఐలు ఎం.ప్రశాంత్‌కుమార్, నీలావతి, బి.వాసుదేవరావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్‌.రాజేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ఎస్‌బీ సీఐ జి.రాంబాబు, సీహెచ్‌ రుద్రశేఖర్, వన్‌టౌన్‌ సీఐ బి.వెంకటరావు, టూటౌన్‌ సీఐ సీహెచ్‌.లక్ష్మణరావు, రూరల్‌ సీఐ టీవీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.   

ఫిర్యాదు చేయడం ఇలా..   
మొబైల్‌ పోగొట్టుకున్న బాధితులకు వీజెడ్‌ఎమ్‌మొబైల్‌ట్రాకర్‌ డాట్‌ ఇన్‌ వెబ్‌పోర్టల్‌ ఓ వరం. వెబ్‌పోర్టల్‌ను ఓపెన్‌ చేశాక రిపోర్ట్‌ కంప్‌లైంట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే, లోపల రిపోర్ట్‌ కంప్‌లైంట్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో పేరు, కాంటాక్టు నంబర్, ఐఎంఈఐ నంబర్లు, జిల్లా, గ్రామం, ఎక్కడ పోగొట్టుకున్నది, ఫోన్‌ మోడల్‌ తదితర వివరాలు నమోదుచేసి సబ్‌మిట్‌ చేస్తే సరిపోతుంది. కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్టేటస్‌ను చెక్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. రికవరీ అయిన తర్వాత బాధితులిచ్చిన కాంటాక్టు నంబర్‌కు సమాచారం అందుతుంది.

అందరికీ అందుబాటులో వెబ్‌పోర్టల్‌ 
వెబ్‌పోర్టల్‌ విజయనగరం వాసులందరికీ అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశాం. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో సెల్‌ఫోన్‌ బాధితులు నేరుగా ఫిర్యాదుచేసేందుకు వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాం. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ఫిర్యాదు చేసుకోవచ్చు.    
– ప్రొఫెసర్‌ నేతాజీ, వెబ్‌పోర్టల్‌ ఇన్‌చార్జి, విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, దువ్వాడ

చాలా ఆనందంగా ఉంది 
వెబ్‌పోర్టల్‌ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది.  వెబ్‌ రూపకల్పనకు విజ్ఞాన్‌ యాజమాన్యం అహరి్నశలు శ్రమించింది. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో చాలా తొందరగా వెబ్‌ను రూపొందించి, విజయనగరవాసులకు అందించగలిగాం.
– అడారి దీపిక, ఐటీ విభాగం, విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల 

మరిన్ని వార్తలు