శ్రీరస్తు.. మాస్క్‌ మస్టు

27 Jul, 2020 09:39 IST|Sakshi
మాస్క్‌ ధరించిన వధూవరులు

శుభకార్యాలకు సరికొత్త ఆహ్వానం 

కరోనా వైరస్‌ నేపథ్యంలో మారిన వివాహ తంతు  

నిరాడంబరంగా కల్యాణోత్సవాలు 

భౌతిక దూరం పాటిస్తూ ఆశీర్వచనాలు 

పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రుల హాజరు 

పెళ్లంటే ఆకాశమంత పందిళ్లు..తళుకులీనే మండపాలు..భాజాభజంత్రీలు.. బంధుమిత్రులు..ఒకటే హడావుడి.. వివాహ వేడుక జరిగే వీధంతా సందడిగా ఉండేది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో కల్యాణోత్సవం కళ తప్పింది. మాస్కు సమేతంగా రావాలని కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందుతోంది. వేడుకకు హాజరైన వారు కూడా చేతులకు శానిటైజర్లు వేసుకొని..భౌతిక దూరంపాటించాల్సి వస్తోంది.  భజంత్రీలు మోగకుండానే  మూడుముళ్ల బంధం ఒక్కటవుతోంది.  

కర్నూలు(హాస్పిటల్‌): శ్రావణమాసం ప్రారంభమైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వాతావరణమూ చల్లగా ఉంది. ఇదే సమయంలో వివాహానికి ఆగస్టు 14వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కరోనా   నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం మంచి రోజులు ఉండడంతో వాయిదా పడిన కల్యాణోత్సవాలను జరిపేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. అదే విధంగా నూతన వివాహ    వేడుకలు నిర్వహించేందుకూ ముహూర్తాలు ఖరారయ్యాయి.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి   కారణంగా వైభవంగా వివాహం చేసుకునేందుకు     నిబంధనలు అడ్డొస్తున్నాయి. హంగు ఆర్భాటాలు    లేకుండా, పరిమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులను పిలిచి పెళ్లి తంతు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాగైనా ఇప్పుడే పెళ్లి చేయాలని భావించే వారు నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. భాజాభజంత్రీలు లేకుండా, హంగూ ఆర్భాటాల జోలికి వెళ్లకుండా దగ్గరి వారిని మాత్రమే పిలిచి పెళ్లి కానిచ్చేస్తున్నారు.  

పెళ్లికి ఇలా సిద్ధం కావాలి 
ఎవరైనా వివాహం చేయాలంటే ముందుగా సంబంధిత తహసీల్దార్‌ అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికతో పాటు రూ.10 నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాలి. వివాహం చేసే వారు తప్పనిసరిగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకుని ఉండాలి. వధూవరుల తరఫు నుంచి 20 మంది మాత్రమే పెళ్లిలో పాల్గొనాలి. భాజాభజంత్రీలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్‌ 188 ద్వారా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారు.  

మార్గదర్శకాలు పాటించాలి.. 
పెళ్లంటే పదుల సంఖ్యలో ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటామంటే  కుదరదు.  
పెళ్లికి పరిమిత సంఖ్యలోనే హాజరుకావాలి. వచ్చిన వారు సైతం నాలుగు నుంచి ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి.  
నిర్వాహకులతో పాటు పెళ్లికి వచ్చిన వారు సైతం తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ఎవ్వరైనా మాస్క్‌ ధరించకపోతే నిర్వాహకులే మాస్క్‌లు ఏర్పాటు చేయాలి.  
నిర్వాహకులు, పెళ్లికి హాజరైన వారు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా తరచూ కడుక్కుంటుండాలి. ఈ మేరకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.  
అందరినీ ఒకేసారి వేదికపైకి గాకుండా పరిమిత సంఖ్యలో వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. వివాహానికి వచ్చిన వారికి వేసిన కుర్చీల మధ్య ఎడమ ఉండాలి. భోజనాల వద్ద సైతం ఇదే సూత్రాన్ని, భౌతిక దూరాన్ని పాటించాలి.  

మార్గదర్శకాల మేరకు పెళ్లి చేశాం 
మా అబ్బాయి వివాహాన్ని ఇటీవల చేశాం. పెళ్లికి వచ్చిన వారిని ప్రతి బెంచీల్లో నలుగురు గాకుండా ఇద్దరినే కూర్చోబెట్టాం. దీంతో పాటు ప్రతి కుర్చీకి నాలుగు అడుగులు దూరం ఉండేటట్లు చూసుకున్నాం. పెళ్లికి వచ్చిన ప్రతి వ్యక్తికీ చేతులను శానిటేషన్‌ చేశాం. మాస్క్‌ కూడా అందజేశాం. 25 నిమిషాల తర్వాత మళ్లీ వారి వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరికీ శానిటైజ్‌ చేస్తూ వచ్చాం. పెళ్లికి వచ్చే వారిని విడతల వారీగా కొద్ది కొద్ది మందిని ఆహ్వానించాం. వారికి భోజనాలను సైతం అలాగే పిలిచి ఏర్పాటు చేశాం. దీని వల్ల మా పెళ్లిలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.  – వెంకట్, మెడికల్‌ రెప్, కర్నూలు  

కొత్త రకం పెళ్లిని చూసిన అనుభూతి కలిగింది 
నేను ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాను.      అక్కడ వధూవరులతో పాటు       బంధువులు మాస్క్‌లు ధరించి      భౌతిక దూరం పాటించారు. దూర ప్రాంతాల నుంచి బంధువులు      రాకపోయినా నిర్వాహకులు       బాధపడకుండా పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ప్రధానమైన పెళ్లి కుటుంబసభ్యుల సమక్షంలో ఉదయమే ముగించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వారి కోసం రిసెప్షన్‌ నిర్వహించి, భౌతిక దూరం పాటిస్తూఅక్షింతలు చల్లి దీవించే ఏర్పాటు చేశారు. భోజనం వడ్డించే వారికి పీపీఈ కిట్ల మాదిరిగా డ్రెస్‌లు ధరింపజేశారు. భోజనం వడ్డించిన తర్వాత మాస్క్‌లు తీయడానికి, ఆ తర్వాత తినడానికి పలువురు ఇబ్బంది పడటం చూస్తే నవ్వొచ్చింది. దీంతో నా జీవితంలో కొత్తరకం పెళ్లిని చూసిన అనుభూతి కలిగింది. – బి. హైమావతి, కర్నూలు 

మరిన్ని వార్తలు