ముహూర్తం ముందరున్నది

13 Nov, 2022 05:14 IST|Sakshi

మూఢం ముగియగానే పెళ్లి సందడి 

నవంబర్‌ 28 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు 

వచ్చే మే వరకు సుమారు 42 ముహూర్తాలు 

రాష్ట్రంలో 1.50 లక్షలకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా 

సాక్షి, అమరావతి: ‘‘మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది.. మా అమ్మాయి జాతకానికి మీ అబ్బాయి జాతకం బాగా కుదిరింది.. మనం ఇప్పుడే ఒక మాట అనుకుని పెళ్లి ఖాయపర్చుకుంటే మూఢం వెళ్లగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం’’ రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మధ్య సాగుతున్న సంభాషణ ఇది.

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. దీంతో వివాహాలు జరిపించేందుకు శుభలగ్నం కోసం ఎదురుచూస్తున్నారు.

మూఢం ముగియడంతో నవంబర్‌ 28 నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయి. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. డిసెంబర్‌ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం (సంక్రాంతి నెల) కావడంతో వివాహాలు చేయరు. దీంతో వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందుంది ముహూర్తం అంటూ.. పెళ్లి ఏర్పాట్లలో వధూవరుల కుటుంబాలు బిజీ అవుతున్నాయి.  

మార్కెట్‌లకు పెళ్లి కళ.. 
ప్రస్తుత శుభకృత్‌ నామ తెలుగు సంవత్సరం నవంబర్‌ నుంచి వచ్చే మార్చి వరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోనే లక్షా 50 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో మార్కెట్లకు కూడా పెళ్లి కళ వచ్చింది.  ఇప్పటికే ఇళ్ల మరమ్మతుల కోసం సిమెంట్‌ పనులు, ఇళ్లకు రంగులు తదితర అలంకరణ పనులు ఊపందుకుంటున్నాయి.

సరికొత్త శ్రేణి ఆభరణాలతో బంగారం షాపులు రెడీ అవుతున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా రెడీమేడ్‌ దుస్తుల షాపులు, పాదరక్షల షాపులు, పెళ్లి శుభలేఖల షాపులు సిద్ధమయ్యాయి. చాలా చోట్ల కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, బాంక్వెట్‌ హాళ్ల అడ్వాన్సు బుకింగ్‌లు అవుతున్నాయి.   

మే వరకూ శుభ ముహూర్తాలు.. 
నాలుగు నెలల తర్వాత మంచి బలమైన ముహూర్తాలు వస్తున్నందున పెళ్లి బాజాలు మోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూఢం లో వివాహాలు జరిపించరు. మూఢం వెళ్లగానే మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేస్తారు.

ప్రస్తుత శుభకృత్‌ నామ సంవత్సరం తర్వాత వచ్చే శోభకృత్‌ నామ సంవత్సరం 2023 మే నెల వరకు శుభలగ్నాలు ఉన్నాయి. 2023 ఉగాది అయ్యాక చైత్రం, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో మంచి ముహూర్తాల్లో వివాహాలు జరిపిస్తారు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 ముహూర్తాలు ఉన్నాయి.  
     – కొత్తపల్లి సూర్యప్రకాశరావు(లాలూ), పురోహితుడు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా  

మరిన్ని వార్తలు