ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు!

5 May, 2021 03:51 IST|Sakshi
అమ్మాయి నచి్చతే అబ్బాయి చేయి పట్టుకుని తీసుకువెళ్లిన తర్వాత గ్రామ పెద్దలు నీళ్లు పోసి వివాహం చేస్తున్న దృశ్యం

వరుడు తాళి కట్టడు.. నల్లపూసల దండ వేస్తాడు 

పెళ్లి మంత్రాలుండవు.. ఇంటి పెద్దలే పురోహితులు 

గిరిజన పల్లెల్లో కొండరెడ్ల వివాహ సంప్రదాయమిది 

బుట్టాయగూడెం: బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి తల్లి ఒడిలో.. గిరి శిఖర ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనం.. వారు పాటించే సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారి వివాహ తంతు సైతం ప్రత్యేకమే. కొండరెడ్ల వివాహ సమయంలో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. వీరి పెళ్లిళ్లకు పిలుపులు ఉండవు. పిలవలేదు కదా అని వివాహాలకు ఎవరూ హాజరు కాకుండా ఉండరు. కుటుంబ సమేతంగా అందరూ హాజరవుతారు. పెళ్లి పనుల్లో గ్రామస్తులంతా విధిగా పాల్గొంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 1.25 లక్షల మంది గిరిజనులు ఉండగా.. వీరిలో సుమారు 10 వేల మంది కొండరెడ్డి తెగకు చెందిన వారు. కొండరెడ్డి గిరిజనుల్లో అత్యధికులు బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఎత్తైన కొండల నడుమ గిరి శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు.  

కొన్ని పద్ధతులు మారినా ఆచారం ప్రకారమే.. 
కొండరెడ్డి గ్రామాల్లో పెళ్లి విషయంలో 1980 తరువాత కొన్ని పద్ధతులు మారినా.. పూర్వ ఆచారాలనే కొనసాగిస్తున్నారు. 1980వ సంవత్సరానికి ముందు ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే.. ఆ విషయం పెద్దలకు చెప్పేవారు. తర్వాత ఆ అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని ఆ యువతిని తాను పెళ్లాడుతున్నానని బహిరంగంగా చెప్పేవాడు. అతడిని పెళ్లాడటం ఆ యువతికి ఇష్టం లేకపోయినా ఊరి పెద్దలు వారిద్దరికీ వివాహం చేసేవారు.

మొదట ఊరి పెద్దలు వరుడు, వధువు తలపై నీళ్లు పోస్తే.. ఆ తరువాత వరుడు ఆ యువతి మెడలో నల్లపూసల దండ వేసేవాడు. ఇలా పెళ్లి తంతు పూర్తయ్యేది. పెళ్లికి పెద్దలే పురోహితులు. మంత్రాలు ఉండవు. వారిద్దరూ సుఖంగా ఎలా కాపురం చేసుకోవాలో నాలుగు మాటలు చెప్పటం ద్వారా తంతు ముగిసేది. ఇటీవల ఈ పద్ధతుల్లో కొంత మార్పు వచ్చింది. ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. వారు, ఊరి పెద్దలు కలిసి యువతి, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తారు. ఈ మధ్య కాలంలో తాళి కట్టే సంప్రదాయం కూడా మొదలైంది. 

పతాణాలు తప్పనిసరి 
పెళ్లి అనంతరం వధూవరులకు పతాణాల కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు వైపు వారు వధువును గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. వరుడు, అతని తరఫు వారు వధువును వెతికి పట్టుకోవాలి. ఆ తరువాత వధూవరులు ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్తులంతా వారిద్దరి కాళ్లకు అడ్డుపడుతూ బురదలో దొర్లుతారు. ఆ సమయంలో కింద దొర్లే వారికి పెళ్లికొడుకు డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ. 

ఐదు రోజుల పాటు విందు తప్పనిసరి 
పెళ్లి చేసిన కుటుంబాలు తప్పనిసరిగా గ్రామస్తులందరికీ ఐదు రోజులపాటు సహపంక్తి భోజనాలు పెట్టవలసిందే. అందులో మాంసం తప్పనిసరి. మొదటి మూడు రోజులపాటు బంధువులు, చుట్టుపక్కల వారు భోజనాలకు వస్తారు. మూడో రోజున శోభనం జరిపిస్తారు. నాలుగో రోజున ఊరందరికీ భోజనాలు (ఊర బంతి) పెట్టి తీరాలి. దీనికి గ్రామంలో ఎవరైనా హాజరుకాకపోతే.. పెళ్లి వారింటి నుంచే వారికి భోజనం పంపిస్తారు. ఐదో రోజున మాత్రం పెళ్లి జరిగిన రెండు కుటుంబాల వారు, బంధువులకు భోజనాలు పెడతారు. ఇలా ఐదు రోజుల పెళ్లి సందడిగా.. సంప్రదాయబద్ధంగా సాగిపోతుంది. 

మా పెళ్లికి పెద్దలే పురోహితులు 
మా తెగల్లో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. మంత్రాలు ఉండవు. తాళి»ొట్టు ఉండదు. నా పెళ్లి అలాగే జరిగింది. నేను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. అదే విషయాన్ని పెద్దలకు చెప్తే వారు అమ్మాయివైపు వారితో మాట్లాడి వివాహం చేశారు. మెడలో నల్లపూసల దండ వెయ్యడంతో నా పెళ్లి అయిపోయింది.  
– కెచ్చెల బుల్లిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం 

పెద్దల మాటకు విలువిస్తాం 
పెళ్లి సమయంలో పెద్దల మాటకే విలువ ఇస్తాం. వారు చెప్పిందే వేదం. అదే ఆచారం. గ్రామ దేవతలు మా కుల దేవతలు. వారినే పూజిస్తాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చేసే పండుగలో తప్పనిసరిగా గ్రామ దేవత పూజలు విధిగా చేస్తాం.  
– కెచ్చెల పద్మ, కొండరెడ్డి మహిళ, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం 

మరిన్ని వార్తలు