అంగన్‌వాడీల్లో ‘స్మార్ట్‌’ సేవలు 

17 Oct, 2022 09:28 IST|Sakshi
అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్న కలెక్టర్‌ (ఫైల్‌)

సాక్షి, పుట్టపర్తి:  అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో స్మార్ట్‌ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నారు. త్వరలో అధికారికంగా ఈ సేవలను  ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్‌ సేవలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టడంతో పాటు పాదర్శక సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు.  

జిల్లాకు 2,863 స్మార్ట్‌ఫోన్ల పంపిణీ 
జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులకు గానూ 2,824 అంగన్‌వాడీ కేంద్రాలు (మినీ, మెయిన్‌) ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తల పర్యవేక్షణకు గానూ 39 మంది సూపర్‌ వైజర్లు ఉన్నారు. అంగన్‌వాడీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా వీరందరికీ 2,863 స్మార్ట్‌ ఫోన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ రకాల సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఫీడ్‌ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది.  

పక్కాగా పౌష్టికాహారం 
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. వీటి వివరాలను వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ట్రాక్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్థిదారుల హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్‌ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్య పరచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్మార్ట్‌ ఫోన్ల విధానం ఎంతగానో దోహదపడుతుంది.  

పారదర్శక సేవలు అందుతాయి 
జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోంది. ఐసీడీఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం. స్మార్ట్‌ ఫోన్ల మంజూరుతో అక్రమాలకు చెక్‌ పడటంతో పాటు పారదర్శక సేవలు  అందుతాయి.  
– రెడ్డి రమణమ్మ, ఇన్‌చార్జి పీడీ, ఐసీడీఎస్‌   

(చదవండి: సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! )

మరిన్ని వార్తలు