అర్హులందరికీ పథకాల వర్తింపే లక్ష్యం 

16 Apr, 2022 17:32 IST|Sakshi

నరసాపురం రూరల్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు వలంటీర్లు కీలకమని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. లిఖితపూడిలో శుక్రవారం వలంటీర్ల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ ఎన్వీ శివప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం విశిష్ట సేవలందించిన వలంటీర్లు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. సేవా దృక్పథంతో సమర్థవంతంగా సేవలందిస్తున్నారన్నారు.

నరసాపురం నియోజకవర్గంలో ఐదుగురు సేవా వజ్రా, 15 మంది సేవారత్న, 960 మంది సేవామిత్ర పురస్కారాలను అందుకున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా పథకాలను అందించడంలో వలంటీర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం మండలంలోని గొంది, చిట్టవరం, పాతనవరసపురం, కొత్తనవరసపురం, సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక, కొప్పర్రు, కే.బేతపూడి, సీతారాంపురం నార్త్, సీతారాంపురంసౌత్, రాజుగారితోట తదితర గ్రామాలకు చెందిన వలంటీర్లకు ఆయన పురస్కారాలు అందజేశారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌ కొల్లాబత్తుల రవికుమార్, బొక్కా రాధాకృష్ణ, ఉంగరాల రమేష్, దొంగ మురళీకృష్ణ, పోతురాజు చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు