గిరిపల్లెల్లో సంక్షేమ రాజ్యం 

23 May, 2022 13:59 IST|Sakshi

అడవిబిడ్డల ఇళ్లకు చేరుతున్న సంక్షేమ పథకాలు

గత పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన మన్యం

4000 మందికి పైగా పోడు భూములకు పట్టాలు

మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధుల కేటాయింపు

ఏజెన్సీ పేరు చెప్పగానే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో కొండల్లో జీవనం సాగిస్తున్న కొండరెడ్ల బాధలను ఊహించుకుంటారు. ప్రభుత్వ ఫలాలు అందక వారు పడే ఇబ్బందుల గురించి చర్చించుకుంటారు. అది ఒకప్పుడు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పరుగులు తీస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధితో పాటు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో ఆదివాసీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. 

బుట్టాయగూడెం: గతంలో గిరిజనులు అభివృద్ధిలో వెనుకబడి ఎన్నో ఇక్కట్ల మధ్య జీవించేవారు. వారికి సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో గిరిజనుల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. మారుమూల గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణాలతో పాటు కొండ ప్రాంత మారుమూల గ్రామాలకు సైతం తారు రోడ్లు వేయించారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిపుత్రులకు పట్టాలు ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో అనేక సంక్షేమ, అభివృద్ధి ప«థకాలు అమలు చేసి వైఎస్సార్‌ ఆదివాసీల ఆపద్భాందవుడిగా నిలిచిపోయారు. వైఎస్సార్‌ అకాల మరణంతో ఏర్పడిన ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. 

జగనన్న పాలనలో.. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో గిరిజనుల కష్టాలు తెలుసుకున్న ఆయన “నేను విన్నాను.. నేనున్నాను’  అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సుమారు 4,000 మందికి పైగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వడమే కాకుండా ఆ భూములకు రైతు భరోసా పథకం వర్తించేలా ఏర్పాటు చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలు జోలు మోతతో అనేక అవస్థలు పడేవారు. ఆ కష్టాలు తీర్చేలా సుమారు 15 బైక్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి అనారోగ్య బాధితులకు సేవలందించేలా కృషి చేశారు.  

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
మారుమూల గ్రామాల్లో సైతం సుమారు రూ.40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేశారు. సుమారు రూ.15 కోట్లతో నాడు–నేడు పథకంలో పాఠశాలల రూపురేఖలు మార్చి కొండ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకునేలా రూపుదిద్దారు. రూ.18 కోట్ల వ్యయంతో సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌లు, ఆర్‌బీకేల నిర్మాణానికి కృషి చేశారు. రూ.15 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా వందల కోట్ల నిధులను సీఎం జగన్‌ గిరిజన ప్రాంతానికి కేటాయించారు. ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నాయి. ప్రతీ కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ సంక్షేమ పథకాలు కొండలు దాటి ఇళ్లకు చేరేలా వలంటీర్‌ల వ్యవస్థ ద్వారా కృషి చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో కొండ ప్రాంతాల్లో మహిళలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో ఉన్న రేగులపాడులో ఉంటున్నాడు. 30 ఏళ్లుగా 2 ఎకరాల్లో కొండపోడు వ్యవసాయం చేస్తుండగా.. ఆ భూమికి పట్టా కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టా రాలేదు. ఇప్పుడు వలంటీర్‌ ద్వారా ఇంటికే పట్టా తెచ్చి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
-గురుగుంట్ల లచ్చిరెడ్డి

మారుమూల గుంజవరం గ్రామం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందుతున్న పథకాలపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వారి గ్రామంలో ప్రతీ ఇంటికీ రూ. 2 లక్షల వరకూ సంక్షేమ పథకాలు అందాయని చెబుతోంది. తనకు సుమారు రూ. 2,93,000 సొమ్ము ప్రభుత్వ పథకాల ద్వారా అందాయి. నేరుగా తన బ్యాంక్‌ ఖాతాలోకి సొమ్ములు చేరాయి.
-పాయం రత్నం..  

గుంజవరం గ్రామం. ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల రూపంలో రూ. 2,86,000 సొమ్ము అందింది. పథకాల కోసం పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వాళ్లమని.. జగనన్న ప్రభుత్వంలో వలంటీర్‌ల ద్వారా పింఛను సొమ్ము తెల్లవారకముందే అందుతుందని అంటున్నాడు.    
-మడివి శిరమయ్య.

మరిన్ని వార్తలు