గిరిజన రైతుల సంక్షేమమే జీసీసీ లక్ష్యం 

6 Jun, 2021 04:13 IST|Sakshi
గిరిజనుల నుంచి అటవీ ఫలసాయాన్ని సేకరిస్తున్న జీసీసీ సిబ్బంది

కరోనా కష్టకాలంలోనూ విస్తృత సేవలు 

రూ.368 కోట్ల నుంచి రూ.450 కోట్లకు పెరిగిన వ్యాపారం 

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వెల్లడి 

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) గిరిజనులకు అండగా నిలుస్తున్నదని, గతేడాది కంటే ఎక్కువ వ్యాపారాన్ని చేసి గిరిజనులకు ఆర్థిక చేయూతను అందించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. జీసీసీ ద్వారా 2020–21 ఏడాదిలో సాగించిన ఆర్థిక కార్యకలాపాల ప్రగతికి సంబంధించిన వివరాలను ఆమె శనివారం మీడియాకు ఓ ప్రకటనలో వివరించారు. గతేడాది  గిరిజన ఉత్పత్తుల ద్వారా రూ.368 కోట్ల వ్యాపారాన్ని చేసిన జీసీసీ.. ఈ ఏడాది రూ.450 కోట్లు ఆర్జించిందని తెలిపారు.  గిరిజనులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించేలా జీసీసీ చూస్తుందని పేర్కొన్నారు.
  
గిరిజన ప్రాంతాల్లో  ప్రత్యేకంగా పెట్రోల్‌ పంపులను, సూపర్‌ బజార్లను నిర్వహించడంతో పాటు పౌర సరఫరాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా జీసీసీ నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు గిరిజన రైతులకు అవసరమైన రుణాలను సైతం జీసీసీ అందిస్తుందని పేర్కొన్నారు.  2019–2020లో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు రూ.13.18 కోట్లను వెచ్చించగా, 2020–21లో రూ.76.37 కోట్లు వెచ్చించామని తెలిపారు. 2019–20లో జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు రూ.24.22 కోట్ల మేర జరిగితే 2020–21లో  రూ.33.07 కోట్లకు పెరిగాయని వివరించారు. మెరుగైన ఫలితాలను సాధించిన జీసీసీ అధికార, సిబ్బందిని 
పుష్ప శ్రీవాణి అభినందించారు. 

మరిన్ని వార్తలు