విరగ్గాసిన కాఫీ.. మురిసేలా మిరియం

12 Oct, 2022 10:50 IST|Sakshi
మినుములూరు ప్రాంతంలో విరగ్గాసిన మిరియాలు, పండ్ల దశకు వచ్చిన కాఫీ పంట

సాక్షి,పాడేరు: గిరిజనుల సాగులో ఉన్న కాఫీ తోటల్లో ఈ ఏడాది కాపు అధికంగా ఉంది. విరగ్గాసిన కాయలతో పాడేరు డివిజన్‌లో తోటలు కళకళలాడుతున్నాయి.  ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ముందస్తుగానే పక్వానికి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పండ్ల దశకు చేరుకుంటున్నాయి. కాపు ఆశాజనకంగా ఉందని, దిగుబడులు బాగుంటాయని గిరిజన రైతులు ఆనందంగా చెబుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఐటీడీఏ కాఫీ విభాగం గత 20ఏళ్ల నుంచి కాఫీ సాగును ప్రోత్సహిస్తోంది. పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో సుమారు 2,10,000 ఎకరాల్లో కాఫీ తోటలుండగా  1,50,000 ఎకరాల విస్తీర్ణంలో గల కాఫీ తోటలు ఫలాసాయాన్ని ఇస్తున్నాయి.  మే నెల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు కాఫీ పంటకు ఎంతో మేలు చేశాయి. గత ఏడాది ఏడు వేల టన్నుల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు   కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు.  

ఆశాజనకంగా మిరియాల కాపు  
కాఫీ తోటల్లో గిరిజన రైతులు అంతర పంటగా సాగు చేస్తున్న మిరియాల కాపు కూడా ఆశాజనకంగానే ఉంది. ముందుగానే కాపు వచ్చింది. సుమారు లక్ష ఎకరాల కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కాఫీ తోటకు నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ వృక్షాలకు మిరియాల పాదులను ఎక్కించి అంతర్‌ పంటగా   సాగు చేస్తున్నారు. ప్రతీ చెట్టుకు ఉన్న మిరియాల పాదుల ద్వారా కనీసం 10 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిరియాల దిగుబడులు కూడా అధికంగానే ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  కాఫీ, మిరియాల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  కాఫీ రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు.   

(చదవండి: అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ)


 

మరిన్ని వార్తలు