వాణిజ్య ఖిల్లా ‘పశ్చిమ’ 

6 Apr, 2022 05:04 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా ఏర్పడిన నూతన పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య ఖిల్లాగా అవతరించింది. డెల్టా, గోదావరి, సముద్ర తీర ప్రాంతాలతో ఆవిష్కృతమైంది. జిల్లాగా ఏర్పడిన నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేశారు. ఆక్వా ఉత్పత్తులు, విదేశీ ఎగుమతులు, వాణిజ్య, విద్యాసంస్థలు కలబోతగా భీమవరం కేంద్రంగా జిల్లా అవతరించింది. ఆధ్యాత్మిక సౌరభం, రాజకీయ చైతన్యంతో విరాజిల్లనుంది.  

ఆక్వాహబ్‌గా పేర్గాంచి.. 
ప్రధానంగా 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతో భీమవరం ఆక్వాహబ్‌గా మారింది. ఆక్వా చెరువులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్, సీడ్‌ యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి అమెరికా, చైనా, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంకతో పాటు యూరప్‌ దేశాలకు నిత్యం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.  

రెండో బార్డోలి: స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండో బార్డోలిగా పేర్గాంచింది.  
ఆధ్యాత్మిక సౌరభం: పాలకొల్లు, భీమవరంలో పంచారామక్షేత్రాలు, భీమవరంలో మావుళ్లమ్మవారి ఆలయం, పెనుగొండలో వాసవీ మాత ఆలయం, నరసాపురంలో ఆదికేశవ ఎంబేరుమన్నార్‌ కోవెలతో జిల్లా ఆధ్యాత్మికంగా విలసిల్లుతోంది.  
కళలకు ప్రసిద్ధి: పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో రంగస్థల, సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులుగా వెలుగొందుతున్నారు.  
రాజకీయ చైతన్యం: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా కీలకం. ఇక్కడి నుంచి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు.  
చారిత్రక నేపథ్యం: నరసాపురం ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొగల్తూరు రాజులు మొగల్తూరు కేంద్రంగా కృష్ణా జిల్లా వరకూ పాలన సాగించారు. డచ్, బ్రిటిషర్లు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నారు. 300 ఏళ్ల క్రితం డచ్‌ వారు నిర్మించిన వైఎన్‌ కళాశాల పరిపాలనా భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.  
లేసు, వాణిజ్య ఉత్పత్తులు: ఐర్లాండ్‌ దేశస్తులు పరిచయం చేసిన లేసు అల్లికల పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉంది. మొగల్తూరు మామిడి, మోళ్లపర్రు ఎండుచేపలు, పాలకొల్లు కొబ్బరి, నరసాపురం బంగారం వ్యాపారం, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్, ఆయిల్‌ విక్రయాలకు పేర్గాంచింది. 
ఇస్రో ఇంధన తయారీ: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల్లో అవసరమైన ఇంధనాన్ని తణుకు కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్నారు. 1988 నుంచి ఆంధ్రా సుగర్స్‌ అనుబంధ సంస్థలో తయారైన ఇంధనాన్ని ఇస్రో ఉపయోగిస్తోంది.  
విద్యా నిలయం: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీలు ఉన్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం కేంద్రంగా ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు