గుండెపోటు ఎలా గుర్తించాలి.. గుండెపోటు రాకుండా ఉండాలంటే..

29 Sep, 2022 07:56 IST|Sakshi

25 ఏళ్లకే గుండె సమస్యలు 

మారిన ఆహార నియమాలు, అలవాట్లతో ముప్పు 

శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడే కారణం 

ఉమ్మడి పశ్చిమలో ఏటా 10–20 శాతం పెరుగుతున్న కేసులు 

నేడు వరల్డ్‌ హార్ట్‌ డే 

సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్‌): ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్‌ హార్ట్‌ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 10 నుంచి 20 శాతం గుండె వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందు, సిగరెట్లు, కల్తీ ఆహారం, అధిక నూనెలతో కూడిన ఆహారం గుండెకు ప్రమాదకరం. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు తప్పనిసరిగా అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో 45 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్లకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబర్‌ 29న వర్డల్‌ హార్ట్‌డే నిర్వహిస్తూ గుండెను ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ పీఆర్‌కే వర్మ గుండెను ఎలా కాపాడుకోవాలో వివరించారు.  

గోల్డెన్‌ అవర్‌లో చికిత్స ముఖ్యం 
గుండెపోటు వచ్చిన వక్తికి అత్యవసరంగా వాడే రెండు రకాల మాత్రాలున్నాయి. అవి  ASPIRIN 325  mg,  Sorbitrate 5  mg.. గోల్డెన్‌ అవర్‌(మొదటి ఆరు గంటలు)లో ఆస్పత్రిలో చేరితో గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు. తర్వాత పేషేంట్‌ గుండెకు సంబంధించి ఈసీజీ, ఈకో, యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించి గుండె పరిస్థితి తెలుసుకుని సరైన వైద్యం అందించవచ్చు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కోవిడ్‌ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దాంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత ఐదేళ్లుగా గుండె వ్యాధుల కేసులు ఏటా 10 నుంచి 20 శాతం పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది జిల్లాలో 10 వేల నుంచి 20 వేల కేసులు ఉంటున్నాయి.  

ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ 
గుండె వైద్యం అంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్‌ పుణ్యమా అని ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీలో గుండెకు ఉచిత వైద్యం అందుతోంది. నేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీను అద్భుతంగా అమలు చేయడంతో గుండెకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిల్లో గుండెకు సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. భీమవరం వర్మ ఆస్పత్రి, తణుకు యాపిల్‌ ఆస్పత్రి, ఏలూరు ఆశ్రమం ఆస్పత్రి, ఏలూరు విజయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో గుండె వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 

జన్యుపరంగానూ గుండెపోటు 
గుండె పోటు ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోనూ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. ఇక ముఖ్యంగా మద్యపానం, ధూమపానం చేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, బీపీ, సుగర్, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది. అధిక ఒత్తిడి వల్ల బీపీ పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. ఆందోళన వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. 

గుండెపోటు ఎలా గుర్తించాలి 
గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్య భాగంలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే గుండె వైద్య నిపుణులు ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. చాలా మంది గుండెపోటును గ్యాస్‌ నొప్పిగా తీసుకుని సొంత వైద్యం లేదా స్థానికంగా ఉండే క్లినిక్‌ల్లో వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు.  

గుండెపోటు రాకుండా ఉండాలంటే.. 
మద్యపానం, ధుమపానం మానాలి. ప్రతి రోజూ వ్యాయమం చేయాలి. పాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోరాదు. కనీసం 45 నిమిషాలు నడవాలి. రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. బీపీ, సుగర్‌ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండాలి.  

మరిన్ని వార్తలు