వాట్సాప్‌ స్పామ్.. 95 శాతం మంది బాధితులే

6 Mar, 2023 03:58 IST|Sakshi

చిర్రెత్తిస్తున్న స్పామ్‌ మెసేజ్‌లు

ఈ సమస్య ఎదుర్కొంటున్న వారు 95 శాతం మంది

లోకల్‌ సర్కిల్‌ సంస్థ సర్వేలో వెల్లడి

ఆఫీస్‌లోనో.. ఇంట్లోనో పనిలో నిమగ్నమై ఉండగా వాట్సాప్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. ఎవరు మెసేజ్‌ పంపారో.. ఏంటోనని పని ఆపేసి మరీ చూస్తే.. ‘ఫలానా షోరూమ్‌లో పండుగ ఆఫర్‌ ఉంది. త్వరగా షాపింగ్‌ చేయండి. ఆఫర్‌ వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి’ అనే మెసేజ్‌ కనిపిస్తుంది. అలాంటివి చూడగానే చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి మెసేజ్‌లు దేశంలోని వాట్సాప్‌ వినియోగదారుల్లో 95 శాతం మందిని విసిగిస్తున్నాయి.

రోజుకు కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్పామ్‌ మెసేజ్‌లు వాట్సాప్‌ వస్తున్నాయి. ‘లోకల్‌ సర్కిల్‌’ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలియని నంబర్ల నుంచి వస్తున్న ఇలాంటి మెసేజ్‌లపై దేశవ్యాప్తంగా 351 జిల్లాల్లో 51 వేల మంది వాట్సాప్‌ వినియోగదారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. వీటిల్లో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్, వాణిజ్య ప్రకటనలు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు వంటివి ఉంటున్నట్లు తేలింది.

ఇలా చేయండి

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన వాట్సాప్‌కు అభ్యంతరకర, అసభ్యమైన మెసేజ్‌లు పంపినా.. పదేపదే స్పామ్‌ మెసేజ్‌లతో ఇబ్బంది పెడుతున్నా సంబంధిత కాంటాక్ట్‌లను బ్లాక్‌ చేసే అవకాశం వాట్సాప్‌లో ఉంది. ఇలా చేస్తే వాట్సాప్‌ ఫిర్యాదుల బృందానికి రిపోర్ట్‌ ఫార్వర్డ్‌ చేయబడుతుంది. ఒకే కాంటాక్ట్‌పై ఎక్కువ రిపోర్ట్‌లు నమోదైతే ఆ కాంటాక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. 

మరిన్ని వార్తలు