‘ఆ తర్వాతే ఆనందయ్య మందుల పంపిణీ’

31 May, 2021 17:55 IST|Sakshi

వివరాలు వెల్లడించిన ఆయుష్‌ కమిషనర్‌ రాములు 

విజయవాడ: ఆనందయ్య, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తర్వాతే మందుల పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులు తయారు చేశాడని, ఇందులో P, L, F, ఐ డ్రాప్స్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్‌కి పంపామన్నారు. ఈ మందుల పనితీరు పరిశీలించే క్రమంలో సెంట్రల్‌ ఆయుష్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సహాయం కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. 

ఐ డ్రాప్స్‌కి అనుమతి ఇవ్వలేదు
ఆనందయ్య మందుల్లో P, L, F రకం మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనందువల్ల వినియోగానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. ఇక ఆనందయ్య మందుల్లో బాగా ఫేమస్‌ అయిన ఐ డ్రాప్స్ వల్ల ఎటువంటి హాని జరగదు అనేందుకు ఇంకా పూర్తి స్థాయి  ఆధారాలు లభించలేదని ఆయన వెల్లడించారు. అందుకే ఐ డ్రాప్స్ వినియోగించడంపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు వివరించారు. కె రకం మందు శాంపిల్స్‌ని తాము పరిశీలించలేదని ఆయన చెప్పారు. ఇదే విషయాలని హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చామని ఆయన వివరించారు.

ఆయుర్వేదం కాదు
ఆనందయ్య తయారు చేస్తున్న మందులు ఆయుర్వేద మందులు కాదని స్పష్టం చేశారు ఆయుష్‌ కమిషనర్‌. ఈ మందుల వల్ల కొవిడ్ తగ్గుతుందని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న రోగులు, వైద్యులు సూచించిన ఔషధాలు వాడుతూ ఆనందయ్య మందును అదనంగా వాడటంలో ఇబ్బందులు లేవన్నారు. కానీ కేవలం ఆనందయ్య మందుపైనే పూర్తిగా ఆధారపడటం శ్రేయస్కరం కాదని ఆయన చెప్పారు. 

నేరుగా రావొద్దు
ప్రస్తుతం ఆనందయ్య దగ్గరకు వస్తు‍న్న రోగుల్లో ఎక్కువ మంది పీ,ఎల్‌,ఎఫ్‌ రకం మందులే అధికంగా వినియోగిస్తున్నారని రాములు వివరించారు. ఈ మందులు తీసుకునేందుకు రోగులు నేరుగా రావొద్దని సూచించారు ఆయుష్‌ కమిషనర్‌. రోగుల కుటుంబ సభ్యులు వచ్చి మందులు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలంటూ ఆయన చెప్పారు. 
 

మరిన్ని వార్తలు