ముసుగు తీస్తే లొసుగులే..చెప్పడానికి మాత్రమే వారికి నీతులు.!

21 Nov, 2022 20:45 IST|Sakshi

తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అని శతక కారుడి ఊవాచ. కొన్ని మీడియా సంస్థలు ఇలాగే ప్రవర్తించి తాము అంతేనని  రుజువు చేసుకుంటున్నాయి. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా, శల్య పరీక్షలు చేసి, తామే అంతా కనిపెట్టేశామంటూ కథనాలు ఇచ్చే ఈ మీడియా తమ వరకు వచ్చేసరికి మాత్రం అమ్మో.. మా జోలికి వస్తారా .. అని గగ్గోలు పెడుతోంది. ఎవరిపైన ఐటి లేదా సీబీఐ, లేదా ఈడీ వంటి సంస్థలు సోదాలు నిర్వహిస్తే, విచారణ జరిపితే సంబంధిత వ్యక్తులు ఇలా అన్నారు.. జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు.. అంటూ కథనాలు రాసే ఈ మీడియా తను కూడా అతీతం కాదు అని  ఆచరణలో తెలియజేస్తోంది. 

భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?
ఈనాడు మీడియాకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలలో రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు జరిపితే అదంతా కక్ష అంటూ తమ పత్రికలలో, టీవీ చానళ్లలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. నిజంగానే వీరు ఏ తప్పు చేయకుండా ఉంటే, మొత్తం తెరచిన పుస్తకం అయి ఉంటే ఉలిక్కిపడవలసిన అవసరం ఏమి ఉంటుంది. శంషేర్ గా మొత్తం రికార్డులన్నీ అధికారుల ముందు పెట్టి ఇంకేమైనా కావాలా అని అడిగి ఉండేవారు. అంతే తప్ప అధికారులు ఏది అడిగినా, తమ వద్ద ఆ సమాచారం లేదని, అదంతా హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్ లో ఉందని ఎందుకు చెప్పి తప్పించుకుంటారు? మార్గదర్శి మేనేజర్లు పంచనామా కాగితాలపై ఎందుకు సంతకం పెట్టకుండా నిరాకరించారు? నిజానికి ఒక్క మార్గదర్శిపైనే అధికారులు సోదాలు జరపలేదు. చాలా చిట్ ఫండ్ సంస్థలలో జరిగాయి. అయినా వారెవ్వరూ కక్ష అంటూ ఎందుకు ఆరోపించలేదు. కేవలం మార్గదర్శి పక్షాన ఈనాడు మీడియా మాత్రమే ఎందుకు గోల చేసింది? అదే ఇంకేదైనా సంస్థపై ఏ దర్యాప్తు సంస్థ అయినా సోదా చేసి ఉంటే ఈనాడు ఇలాగే రాసేదా? 

ఉండవల్లి ప్రశ్నలకు బదులేదీ?
2006లోనే తాము డిపాజిట్ల సేకరణ ఆపేశామని మార్గదర్శి అధినేత రామోజీరావు రిజర్వు బ్యాంకుకు తెలియజేసిన తర్వాత కూడా మరో రూపంలో డిపాజిట్లు తీసుకుంటున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన ఆరోపణకు ఎందుకు స్పందించలేదో అర్ధం చేసుకోవచ్చు. డిపాజిట్ అన్న పదం బదులు రిసీట్ అన్న పేరు పెట్టి చిట్  పాడిన వారి డబ్బు తీసుకోవచ్చా? ఇవన్ని చట్ట విరుద్దమా?కాదా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చెప్పారు కాబట్టి తీసుకున్నామని చెప్పిన రామోజీ.. ఇంతకీ ఆ జడ్జి ఎవరో ఎందుకు చెప్పలేదు? చేసింది తప్పని గమనించి మాట మార్చేశారా? చిట్లు కట్టిన వారి వివరాలు ఇవ్వడానికి కూడా మార్గదర్శి నిరాకరించడం గమనించదగిన అంశం. అంటే ఇందులో ఏమైనా మతలబు ఉందా? మార్గదర్శి డబ్బును ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారా? లేదా? ఉండవల్లి దీనికి సంబంధించి స్పష్టమైన ఆరోపణ చేశారు. అయినా జవాబు ఇవ్వలేదు.  

డబ్బులెలా మళ్లించారు?
మార్గదర్శి కేసు సుప్రింకోర్టులో విచారణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఉమ్మడి ఏపీ హైకోర్టులో  కొట్టివేసిన తీరుపై ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఏడాది తర్వాత ఆ సంగతి తెలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇందులో ఏదో మతలబు వ్యవహారం లేకపోతే రామోజీరావు ఇలా ఎందుకు చేశారన్న సందేహం వస్తుంది. సుప్రీంకోర్టులో కేసు కోసం రామోజీ హడావుడి పడ్డారన్న విమర్శలు వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు తీసుకుంది. మార్గదర్శి ఎవరికి బకాయి పడలేదు కదా అని కొందరు వాదిస్తుంటారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించవచ్చని చెబుతారా? ప్రభుత్వ సంస్థలలో ఏదైనా చిన్న ఉల్లంఘన జరిగినా కావ్..కావ్ .. అని రాసే ఈ మీడియా తాను మాత్రం ఎలాంటి అతిక్రమణలనైనా చేయవచ్చని భావిస్తోందా? అది తన హక్కుగా అనుకుంటోందా? గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిధుల దారి మళ్లింపు వ్యవహారం బయటపడింది. అనేక సంస్థలు ఇలా నిధులు మళ్లించే దెబ్బతిన్నాయి. రామోజీకి సంబంధించిన పలు సంస్థలు కూడా నష్టాలు చవిచూశాయి. అందువల్లే ఆయన తన టివి చానళ్లను ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థకు విక్రయించిన సంగతి అందరికి గుర్తు ఉంది కదా!

అబ్బో ఏం మేనేజ్‌మెంటో!
విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా నిధుల మళ్లింపు కేసును ఎదుర్కొంటున్నారు. ఆయనే కాదు. అనేక సంస్థలు కూడా ఈ కేసుల్లో చిక్కుకున్నాయి. వారికి మీడియా సంస్థలు ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేదేమో! ఒకవేళ వచ్చినా తమ పైన కక్ష సాధింపు అని ఆరోపణ చేసి ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వానికి సహకరించకుండా ఉండడానికి యత్నించేవారేమో! ఈ నేపధ్యంలోనే ఉండవల్లి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రామోజీరావుకు దేశంలోని బ్యాంకులను అప్పగిస్తే అద్బుతంగా నడిపి భారతరత్న పొందేవారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పత్రిక ముసుగులో తప్పులను రామోజీ కప్పి పుచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. నిజమే. 

చివరికి కాపురాలను బజారు కీడుస్తారా?
రామోజీ వద్దకు కేంద్ర హోం మంత్రి వంటివారు సైతం వెళితే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు వెళ్లి డిక్టేషన్ తీసుకుంటే ఇలాంటి ధైర్యం వస్తుందేమో! ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వ అధికారులు జరిపిన సోదాలతో ఈనాడు మీడియా మరింతగా రెచ్చిపోతోంది. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే గత మూడేళ్లుగా అంటే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలు సంసారాలు కూడా చేయడం లేదన్న అర్ధం వచ్చేలా పిచ్చి కధనాలు రాసి ప్రజల చేత అపహాస్యానికి గురి అవుతోంది.

ఏపీలో అమరావతి నిర్మాణం జరగడం లేదని యువత ఇక్కడ సంసారం చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారట.! ఇక్కడ ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే కాపురాలు చేస్తున్నారట. ఇది నిజమే అయితే చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు చేసిన  పాలనలో వచ్చిన పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా ఉండి ఉంటే ఇక్కడే యువత ఉండి సంసారాలు చేస్తుండాలి కదా? ఆ మాటకు వస్తే రామోజీరావు కుటుంబం ఎప్పుడో ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయింది? చంద్రబాబు మొత్తం ఏపీని అభివృద్ది చేసి ఉంటే ఇక్కడే సంసారాలు చేసి తెగ పిల్లలను కనేసి ఉండేవారు కదా?

ముఖ్యమంత్రి జగన్‌పై కోపంతో పిచ్చి వార్తలు రాసి ఈనాడు పరువు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ కధనంపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలు చూస్తే దానిని రాసినవారు సిగ్గుతో తలవంచుకోవల్సిందే. కనుక కేవలం కక్ష కట్టి అర్ధం పర్దం లేని వార్తలు రాసి  ప్రజల చీత్కారానికి గురి కావద్దని హితవు చెప్పడం మినహా ఏమి చేయగలుగుతాం?
-హితైషి, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు