ఒక పావురం రూ.10 కోట్లు, మరొకటి రూ.14 కోట్లు.. సరిపోలేదా ఇంకా ఇస్తాం!

30 Nov, 2021 08:21 IST|Sakshi

ఎక్కడున్నా వాలిపోతాయి.. ఎక్కడికి వెళ్లినా ఇంటికి చేరిపోతాయి. ప్రేమకు..శాంతికి సంకేతాలు ఈ పావురాలు. ఏ వేడుకలో అయినా ఏ పోటీలో అయినా విజేతగా నిలిచే ఈ పక్షుల కథ అద్యంతం ఆసక్తికరం.. ఆకాశం ఏనాటిదో వీటి అనురాగం కూడా ఆనాటిదే అని మురిసిపోతున్నారు  ఆ కుటుంబ సభ్యులు.. గగనపు వీధులలో తిరుగాడుతూ ఊసులు ఊహలు మోసుకువచ్చి విశాఖ వీధులలో నడయాడే ఈ ప్రేమ జీవులపై ప్రత్యేక కథనం.. 

సాక్షి, విశాఖపట్నం: బెల్జియంలో ఒక పావురం రూ.14 కోట్లు పలికింది. ఇంకొక పావురాన్ని చైనా వాళ్లు రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. పావురాలకు ఇంత ధర ఉందా అని హా..శ్చర్యపోతున్నారా? ఔనండీ అవే రేస్‌ పావురాలు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ధర ఉంది. ఇటువంటివాటిని హోమింగ్‌ రేస్‌ పావురాలంటారు.  అటువంటి పావురాలతో బుక్కాసింగ్‌కు విడదీయరాని బంధం ఏర్పడింది. బుక్కాసింగ్‌ హైదరాబాద్‌లో ఉండేవాడు. అక్కడే పావురాలను మచ్చిక చేసుకున్నాడు. వాటికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు. ( చదవండి: కాలం మారింది.. ఇక మీ టేబుల్‌ వద్దకు వెయిటర్స్‌ రారు, అంతా మీ చేతుల్లోనే! )

బుక్కాసింగ్‌ చెప్పినట్టే పావురాలు నడుచుకునేవి. సుమారు 40 ఏళ్ల క్రితం ఆ కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం విశాఖ వలస వచ్చారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉండేవారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం కొమ్మాది సమీపంలోని సేవానగర్‌లో కాలనీ కట్టి పేదలకు ఇళ్లు ఇచ్చింది. దీంతో సేవానగర్‌లో స్థిరపడ్డారు. 2016 వరకు రకరకాల రేస్‌ పావురాలు ఇతని వద్ద ఉండేవి. బుక్కాసింగ్‌ మృతి చెందిన తరువాత ఆ బాధ్యతను టాంక్‌ శ్యామ్‌ సింగ్, హరదీప్‌ సింగ్‌ (బుక్కాసింగ్‌ కుమారులు), రాజ్‌దీప్‌ సింగ్‌ (బుక్కా సింగ్‌ మనుమడు) కంటికి రెప్పలా కాపాడుతూ వాటికి శిక్షణ ఇస్తున్నారు. 

ఏ రాష్ట్రంలో విడిచిపెట్టినా విశాఖ వచ్చేస్తాయి పూనే, ముంబై, చైన్నై వంటి ప్రాంతాలలో వీటిని వదిలి వైజాగ్‌ వచ్చేలా శిక్షణ ఇచ్చారు. ఒకరోజు ఆర్థిక ఇబ్బందులు కారణంగా రెండు జతల పావురాలు వేరే వాళ్లకు అమ్మాల్సి వచ్చింది. రెండు నెలలు తరువాత అవి తిరిగి వచ్చేశాయి. దాంతో ఇంకెప్పుడూ వీటిని అమ్మకూడదని, ఎంత కష్టమొచ్చినా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు.  


దూరాన్ని బట్టీ వర్గీకరణ ఈ పక్షులు ప్రయాణం చేసే దూరాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో షార్ట్, మిడిల్‌గా ఉంటాయి. 600 కిమీటర్లు  ప్రయాణం చేసేది షార్ట్, 1000 కిలో మీటర్లు ప్రయాణం చేసేవి మిడిల్, 1500 నుంచి 3వే కిలో మీటర్లు ప్రయాణం చేసేవి లాంగ్‌ అని వర్గీకరించారు. 

డిసెంబర్‌లో పోటీలు ఈసారి డిసెంబర్‌లో కోల్‌కతా, బంగ్లాదేశ్‌లు పావురాల పోటీలు ఉంటాయి. అక్కడ వేళ్లేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈసారి కచ్చితంగా విజేతలుగా విశాఖ తిరిగివస్తామని సింగ్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఆయన సాయం మర్చిపోలేం మా నాన్నకు పావురాలు అంటే చాలా ఇష్టం. ఆయనకు మిత్రుడైన చక్రవర్తి (పెందుర్తి దగ్గర గుర్రంపాలెం) 2010లో బెల్జియం నుంచి సుమారు రూ.3 లక్షలు వెచ్చించి రేసు పావురాలు బహుమతిగా ఇచ్చారు. వీటి సంతానం తమ వద్ద ఉందని సింగ్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఉదయం 20–24 రకాల ధాన్యాలు, పప్పులతో తయారు చేసిన ఆల్‌ మిక్చర్‌ ఆహారంగా అందిస్తారు. వాతావరణం మార్పులకు అనుగుణంగా ఇవి కూడా అప్పడప్పుడు మారుతాయి. తిన్నాక సుమారు 3గంటలు, ఒక్కోసారి చాలా ఎక్కువ సమయమే కొండలు, కోనలు చూసి వస్తాయి. ముఖ్యంగా కంబాలు కొండ రిజర్వ్‌ ఫారెస్టు, అప్పుడప్పుడు జూ పార్కు, సీతకొండ, కంబాలు కొండ, విశాఖ బీచ్, ఎర్రమట్టి దిబ్బలు తదితర ప్రాంతాలు చుట్టి వస్తాయి. మధ్యాహ్నం ఇంటికి చేరుకుంటాయి. కాసిన్ని నీరు తాగి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్లీ సాయంత్రం ఆహారం పెట్టాక మళ్లీ అలా సిటీని చుట్టుముట్టివస్తాయి.  

మా దగ్గర ఉన్న హోమింగ్‌ రేస్‌ పావురాలు 600కిలో మీటర్లు 7గంటల్లో ప్రయాణిస్తాయి. ఇంచు మించి గంటకి 90 కిలో మీటర్లు ప్రయాణం చెయ్యగలవు. ఇటీవల పూనేలో వీటిని వదిలితే 3రోజుల్లో ఇంటికి చేరాయి. బెంగళూరు, రాయపూర్, హైదరాబాద్, రాయపూర్, రాజమండ్రి, విజయవాడ, కోల్‌కతా, షొలాపూర్‌ తదితర ప్రాంతాలలో వదిలిన పావురాలు క్షేమంగా అనుకున్న సమయానికి విశాఖ వచ్చాయి. ( చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. )


నాన్న కల నెరవేరుస్తా
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నాన్నకు చాలా ఇష్టం. పాదయాత్ర చేసేటప్పుడు కలవాలనుకున్నారు. సాధ్యం కాలేదు. మా పావురానికి చీటి కట్టించి ఆయన చేతులు మీదుగా వదలాలి అనుకున్నారు. ఆయన కోరిక తీరకుండానే కాలం చేశారు. నాన్న కల నెరవేర్చేందుకు స్థానిక నాయకుల సాయంతో త్వరలో కలుస్తా.  
–టాంక్‌ శ్యామ్‌ సింగ్‌ (బుక్కాసింగ్‌ పెద్ద కుమారుడు) 

పావురాలు మా ఇంట్లో సభ్యులు 
మాది మొదటి నుంచి పేద కుటుంబం.. అయినా పావురాలను ఎప్పుడూ వలదలేదు. ఏ లోటు వచ్చినా వాటికి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. నాన్న చనిపోయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయినా వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం.  –హరదీప్‌ సింగ్‌ 

వీటితో గడపడం చాలా ఆనందం 
పావురాలతో గడపడం అంటే చాలా ఇష్టం. నాకు స్నేహితులు లేరు. ఇవే నాకు అన్నీ...వాటికి గింజలు వేస్తూ ఆడుకుంటూ ఉంటా. అవి చేసే విన్యాసాలు చూస్తుంటే చాలా ఆనందంగా  ఉంటుంది. వాటితో గడపడానికే ఎక్కువ ఇష్ట పడతా.. 
–రాజ్‌దీప్‌ సింగ్, బుక్కా సింగ్‌ మనుమడు  

చదవండి: లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్‌

మరిన్ని వార్తలు