12న అల్పపీడనం!

9 Aug, 2021 02:22 IST|Sakshi

13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్యలో బంగాళాఖాతంలోఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు పడతాయన్నారు. మరోవైపు ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయి. మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రంపై పొడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.

ఈ కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ అల్పపీడనం బలహీనపడేవరకు పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి వాయవ్య దిశగా గాలులు నెమ్మదిగా రాష్ట్రంపైకి వీయనుండటంతో వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో 80 మిల్లీమీటర్లు, వంగరలో 70, కిర్లంపూడిలో 47.25, దుగ్గిరాలలో 41, దేవరాపల్లిలో 39.25, చందర్లపాడులో 39, సత్తెనపల్లిలో 38, కురుపాం, నూజెండ్లల్లో 35, అమరావతిలో 33.5, శంఖవరంలో 33, కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు