గిరి పల్లెలో విషాదం: అన్నం విషయంలో గొడవ.. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా..

8 Feb, 2023 08:24 IST|Sakshi

సాక్షి, అల్లూరి: చింతూరు మండలంలోని కలిగుండం అనే గిరిజన పల్లెలో విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు వారి బలన్మరణానికి కారణమయ్యాయి. భర్త కొట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే..

ఆమె మృతిని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలాఉన్నాయి. భార్యాభర్తలైన కుంజా భద్రయ్య(70), కుంజా సమ్మక్క(65)బంధువుల ఇంట్లో జరిగిన దినకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చారు. తనకు భోజనం పెట్టమని భార్య సమ్మక్కను భర్త భద్రయ్య కోరగా నువ్వే పెట్టుకుని తినమని భార్య చెప్పింది. దీంతో ఆగ్రహించిన భద్రయ్య భార్యను కర్రతో కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇంట్లోని పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె మృతిని తట్టుకోలేని భర్త భద్రయ్య కూడా పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో అతనిని సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు.

మరిన్ని వార్తలు