విషాదం: మూడేళ్లకే ముగిసిన కథ! 

15 Apr, 2021 10:13 IST|Sakshi
నాగరాజు మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌ - శ్రీవల్లి, నాగరాజు (ఫైల్‌)

పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న జంట 

కాపురంలో కలహాలతో విడి విడిగా జీవనం 

తీవ్ర గాయాలతో వాగులో శవమై తేలిన భర్త 

అది తెలిసి ఉరి వేసుకుని భార్య ఆత్మహత్య 

ఒంగోలు హిల్‌ కాలనీలో విషాదం 

ఒంగోలు/టంగుటూరు: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడిచిన మూడేళ్లకే ఆ కాపురంలో విభేదాలు మొదలయ్యాయి. అవి పోలీసుల దాకా వెళ్లాయి. రెండు నెలలుగా విడిగానే జీవనం సాగిస్తున్నారు. ఇంతలో ఏమైందో కత్తిపోట్లకు గురైన భర్త నీటిలో శవమై కనిపించాడు. అది తెలిసిన భార్య ఉరేసుకుని ప్రాణాలొదిలింది. వీరిద్దరి కథ మూడేళ్లకే ముగిసిపోయింది. ఒంగోలు సంజయ్‌గాంధీ కాలనీలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకానికి కారణమైంది.

మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన కమ్మెల వెంకట్రావు, రమాదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వెంకట్రావు కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మూడో కుమార్తె శ్రీవల్లికి, ఒంగోలు హిల్‌కాలనీకి చెందిన కబాలి నాగరాజుకు మధ్య నాలుగేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దల దృష్టికి చేరింది. తొలుత వెంకట్రావు వీరి ప్రేమను అంగీకరించలేదు. చివరకు ఇరువైపుల పెద్దల అంగీకారంతో శ్రీవల్లి, నాగరాజు భార్యాభర్తలయ్యారు. ఇద్దరు కలిసి హిల్‌ టవర్స్‌ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. నాగరాజు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా శ్రీవల్లి (23) స్థానిక పెద్ద మసీదు సెంటర్‌లోని ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తోంది. మూడేళ్లు సజావుగానే సాగిన కాపురంలో రెండు నెలల క్రితం మనస్పర్థలు వచ్చాయి. ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో నాగరాజుపై 498 కేసు కూడా నమోదైంది. ఇంకా సంతానం లేని దంపతులిద్దరూ కలహాల కారణంగా రెండు నెలల నుంచి విడివిడిగా ఉంటున్నారు.

తిరునాళ్లకు వెళ్లి.. విగతజీవిగా మారి.. 
మంగళవారం కొండపి మండలం జాళ్లపాలెం తిరునాళ్లకంటూ కబాలి నాగరాజును మరో ఆటో డ్రైవర్‌ వచ్చి తీసుకు వెళ్లినట్లు హిల్‌ టవర్‌ వాసులు తెలిపారు. అలా వెళ్లిన నాగరాజు బుధవారం ఉదయం టంగుటూరు మండలం మర్లపాడు సమీపంలోని ఇనగలేరులో శవమై తేలాడు. వాగులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు సమాచారం అందడంతో ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ నాయబ్‌ రసూల్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఒంగోలు హిల్‌ కాలనీకి చెందిన కాలే నాగరాజు(30)గా గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై కత్తితో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నాగరాజు సోదరుడి ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీవల్లి ఆందోళనకు గురైంది.

ఇప్పుడే వస్తానమ్మా అంటూ వెళ్లి..
ఇదేమీ తెలియని రమాదేవి గర్భం దాల్చిన తన రెండో కుమార్తెను ఆస్పత్రిలో చూపించేందుకు ఒంగోలు వచ్చి, శ్రీవల్లి వద్దకే బయలుదేరారు. మార్గం మధ్యలోనే శ్రీవల్లి ఎదురుపడటంతో అందరూ కలిసి ఆటో మాట్లాడుకొని మర్లపాడు వెళ్దామనుకుంటుండగా   ఇప్పుడే వస్తా అమ్మా అంటూ శ్రీవల్లి ఇంటికి వెళ్లింది. పది నిముషాలు దాటుతున్నా కుమార్తె రాకపోవడంతో రమాదేవి, ఆమె రెండో కుమార్తె కలిసి శ్రీవల్లి ఇంటికి వెళ్లారు. తీరా అక్కడ శ్రీవల్లి ఉరికి వేలాడుతూ కనిపించింది. రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. ఒక పక్క భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తున్నా భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేక శ్రీవల్లి తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేసింది. ఘటనపై వెంకట్రావు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా కోసం నాగరాజు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాయబ్‌ రసూల్‌ తెలిపారు.  

వెంటనే దించి ఉంటే దక్కేదేమో..
ఇంటికి వెళ్లిన తాము శ్రీవల్లిని కిందకు దించేందుకు యత్నించామని, కానీ అప్పటికే అక్కడకు చేరుకున్న ఎస్సై దించరాదంటూ హెచ్చరించారని మృతురాలి తల్లి రమాదేవి వాపోయింది. శరీరం వెచ్చగా ఉందని, ఆసుపత్రికి తీసుకువెళదామన్నా కుదరదన్నారని, 108కు సమాచారం అందించినా రాకపోవడంతో నాగరాజు సోదరుడు, తాను కలిసి చీర ముడి విప్పి ఉరి నుంచి తప్పించామని తెలిపారు. ఈ తతంగం అంతా పది నిముషాల సేపు సాగగా అప్పటికి కూడా తన కుమార్తె కొన ఊపిరితో ఉండడంతో హుటాహుటిన రిమ్స్‌కు తీసుకువెళ్లామని, వైద్యులు చికిత్స చేస్తూ పది నిముషాల తరువాత మరణించినట్లు చెప్పారని వివరించారు. చూసిన వెంటనే దించి ఉంటే తన కుమార్తె బతికి ఉండేదంటూ రమాదేవి భోరుమంది.
చదవండి:
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య   
పిల్లకు పాలు.. తల్లికి కూల్‌ డ్రింక్‌ 

మరిన్ని వార్తలు