విజయనగరం టూ హైదరాబాద్‌.. ఇద్దరు పిల్లలున్నా ప్రియుడే కావాలని..

23 Sep, 2022 08:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హిరమండలం: ప్రియుడు మోజులో పడి భర్తనే చంపించేసిది ఓ మహిళ. తరువాత ఏం తెలియనట్టు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త వాడిన సెల్‌ ఫోన్‌ సిమ్‌ను మార్చేసి మరొకటి వేసి ఆ ఫోన్‌నే వాడింది. చివరకు అదే ఈ దారుణంతో సంబంధం ఉన్నవారిని పట్టించింది. సుమారు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘాతుకం జరిగింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కొత్తూరు సీఐ ఆర్‌.వేణుగోపాలరావు గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కుంబిర రాజుకు హిరమండలం మేజర్‌ పంచాయతీకి చెందిన సుజాతతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి చిన్నకొల్లివలస గ్రామంలో ఉండేవారు. ఐదేళ్ల క్రితం పిల్లలను చదువుల నిమిత్తం బంధువుల వద్ద విడిచిపెట్టి ఉపాధి కోసం దంపతులిద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు.

అయితే, చిన్నకొల్లివలస గ్రామంలో ఉన్నప్పటి నుంచి సుజాత మాత్రం పాడలి గ్రామానికి చెందిన గురల్లా రాముతో వివాహేతర సంబంధం కొనసాగించేది. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ రాముతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయం తెలిసిన భర్త రాజు భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయాన్ని ప్రియుడుతో ఆమె చెప్పేంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త రాజును ఎలాగైనా అంతమోందించాలని ప్రియుడుతో కలిసి పన్నాగం పన్నింది. 

ఈ క్రమంలోనే సుజాతను హైదరాబాద్‌లో విడిచిపెట్టి ఈ ఏడాది ఏప్రిల్‌ నాలుగో తేదీన రాజు స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయాన్ని ప్రస్తుతం కొత్తూరు మండలం మాసంగిలో నివాసం ఉంటున్న ప్రియుడు రాముకు సమాచారం ఇవ్వడంతోపాటు ఎలాగైనా హతమార్చాలని కోరింది. దీంతో, రాము ఎల్‌ఎన్‌పేట మండలం దనుకువాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కె.నూకరాజు సహాయం తీసుకున్నాడు. ముందు నుంచే రాజు, రాము, నూకరాజు మధ్య పరిచయం ఉంది. దీంతో పార్టీ చేసుకుందామని ఏప్రిల్‌ ఆరో తేదీన రాజుని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉన్న వంశధార నది గట్టువైపు ఆటోలో తీసుకువెళ్లారు. 

రాజుకు బాగా మద్యం తాగించడంతో మత్తులోకి జారుకున్నాక ఆటోను స్టార్ట్‌ చేసేందుకు ఉపయోగించే తాడును మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లో పడేశారు. ఈ విషయాన్ని రాము ప్రియురాలు సుజాతకు ఫోన్‌లో తెలియజేశాడు. అయితే మృతదేహాన్ని అలా వదిలేస్తే దొరికిపోతామని.. కాల్చివేయాలని సుజాత రాముకు చెప్పింది. దీంతో వీరు ఏప్రిల్‌ ఏడో తేదీ రాత్రి మృతదేహాన్ని ఎల్‌ఎన్‌పేట మండలం పెద్దకొల్లివలస పాత గ్రామం వద్దకు తీసుకొని వచ్చి పెట్రోల్‌ పోసి కాల్చేశారు. కొద్దిరోజుల తరువాత అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు కాలిపోయి ఉన్న ఎముకలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దీంతో సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. 

హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో భార్య ఫిర్యాదు 
రాజు గత కొన్నిరోజులుగా కనిపించడం లేదని సుజాతకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతుడి భార్య సుజాత హైదరాబాద్‌ నుంచి వచ్చి ఏప్రిల్‌ 22 తేదీన తన భర్త కనిపించడం లేదని హిరమండలం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. భర్త వాడిన సెల్‌ఫోన్‌లో సిమ్‌ తీసి ఫోన్‌ను మాత్రం సుజాత ఉపయోగిస్తోంది. సెల్‌ఫోన్లో సిమ్‌ తీసినప్పటికీ ఈఎంఐ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా సుజాతనే ఫోన్‌ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. 

తాము ఎలాగైనా దొరికిపోతామని నిందితులు భావించి వీఆర్వో శేషగిరిరావు వద్ద లొంగిపోగా.. ఆతను స్థానిక పోలీసుస్టేషన్‌లో ముగ్గురినీ అప్పగించారు. ఏ–1గా నూకరాజు, ఏ–2గా రాము, ఏ–3గా సుజాతలపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి ఆమదాలవలస కోర్టు తరలించినట్టు సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. ఎస్సై నారాయణస్వామి పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు.  

మరిన్ని వార్తలు