కేంద్రం కనికరమెంత? 

1 Feb, 2023 04:27 IST|Sakshi

పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం నిధులిచ్చేనా? 

2017–18 నుంచి బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించని కేంద్రం 

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు నాబార్డు రుణాల ద్వారా రీయింబర్స్‌ 

బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయిస్తే సత్వరమే పూర్తయ్యే అవకాశం 

సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చి, వంద శాతం వ్యయాన్ని భరించి సత్వరమే ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. ఇందుకోసం 2014లోనే కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని  ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే, అప్ప­టి సీఎం చంద్రబాబు.. కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.

ప్రత్యేక హోదాను కూడా వదులుకోవడానికి కూడా అంగీకరించారు. దీంతో కేంద్రం పోలవరం నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకొంది. 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ప్రభు­త్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభు­త్వానికి అప్పగించింది. బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా కాకుండా ఎల్‌టీఐఎఫ్‌(దీర్ఘకాలిక నీటి పారుదల నిధి) రూపంలో నాబార్డు రుణం ద్వారా నిధు­లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్‌ చేస్తామని) మెలిక పెట్టింది. దీనికీ చంద్రబాబు అంగీకరించారు. ఈమేరకు 2016 డిసెంబర్‌ 26న సంతకం చేశారు. దాంతో బడ్జెట్‌లో నిధుల కేటాయింపు హక్కును రాష్ట్రం కోల్పోయింది.

2017–18 నుంచి బడ్జెట్‌లో కేంద్రం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. పోలవరం మినహా ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద చేపట్టిన 99 ప్రాజెక్టులు పూర్తవడంతో 2022–23లో ఎల్‌టీఐఎఫ్‌ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించి, సకాలంలో ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి కట్టుబడుతుందా? లేదా? అన్నది ఫిబ్రవరి 1న వెల్లడికానుంది. 

రీయింబర్స్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం 
ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి నిర్మాణానికి అయిన ఖర్చును కేంద్రం నా­బార్డు రుణాలతోనే రీయింబర్స్‌ చేస్తోంది. ఈ ప్రక్రియ­లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది నిధుల కొ­ర­తకు దారితీసి, ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపుతోంది. 2021–22లో బడ్జెట్‌లో కేటాయించకపోయినప్పటికీ,  భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు కేటా­యించిన నిధుల్లో మిగులు ఉండటంతో రూ.320 కోట్లను బడ్జెట్‌ ద్వారా పోలవరానికి కేంద్రం విడుదల చేసింది.

2022–23 బడ్జెట్‌లోనూ పోలవరానికి నిధులను కేటాయించలేదు. కేంద్రం బడ్జెట్‌ ద్వారా సరిపడా నిధులు కేటాయించి, సకాలంలో రీయింబర్స్‌ చేస్తే– పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు