శీతాకాలం వచ్చేసింది.. వాహనదారులు వీటిని తప్పక పాటించాలి.. లేదంటే..

19 Dec, 2021 15:20 IST|Sakshi

సాక్షి,సీతంపేట(శ్రీకాకుళం): శీతాకాలం ప్రారంభంతోనే పొగమంచు దట్టంగా కరుస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచులో వాహ నం నడపడం సాహసంతో కూడుకున్నదే. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చేవరకూ గుర్తించలేం. అలాంటి సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలా బారిన పడేందుకు అవకాశం ఉంది. వాతావరణ ఎలా ఉన్నా ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రయాణించక తప్పదు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచులో ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

పాటించాల్సిన జాగ్రత్తలు  
► పొగమంచు కురిసే సమయంలో వీలైనంత వరకు వాహనాలను నడపకపోడం మంచిది  
►  రహదారిపై మంచు తీవ్రత పెరిగితే సురక్షితమైన ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయాలి  
► కార్లు, ద్విచక్రవాహనాలపై సాధ్యమైనంత తక్కువ దూరం ప్రయాణం చేయాలి  
► పొగమంచు కమ్ముకున్నపుడు వాహన వేగం తగ్గించాలి 
► ఎదురెదురుగా వస్తున్న వారు గమనించేలా హెడ్‌లైట్స్‌ ఆన్‌చేసి ఉంచాలి. కొత్త వాహనాలకు ఆ సమస్య లేదు. ఎల్లపుడు హెడ్‌లైట్స్‌ వెలిగే ఉంటాయి   
► వాహనాలకు వైపర్స్‌ పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి   
► డ్రైవర్‌ పక్కన కూర్చునే వారు డ్రైవింగ్‌ తీరును ఎప్పటికపుడు పర్యవేక్షించాలి   
► వాహనం వెనుక.. ముందు రేడియం స్టిక్కర్లు విధిగా అతికించాలి 
► వాహనానికి అమర్చిన రెడ్‌సిగ్నల్స్, బ్రేక్‌ సిగ్నల్స్‌ పనితీరు సరిచూసుకోవాలి 
► పొగమంచు ఉన్నపుడు ఎదురుగా వెళ్లున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నం మానుకోవాలి 

ప్రమాదాలకు ఆస్కారం.. 
► రహదారుల పక్కనే వాహనాలు నిలపడం, మలుపులతో కూడిన రహదారులు ఉండడం 
► పరిమితం కంటే అధికవేగంతో వాహనాలు నడపడం 
► దట్టంగా ఉన్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం 
► రహదారి వెంబడి ఉన్న డివైడర్లను ఢీకోవడం వంటి కారణంగా ఈ సీజన్‌లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది

చదవండి: మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ రేసులో సిక్కోలు మహిళ

మరిన్ని వార్తలు