తొలి రోజు 2,472 నామినేషన్ల ఉపసంహరణ

3 Mar, 2021 03:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో 2,472 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు మంగళవారం, బుధవారం అవకాశం ఇవ్వగా.. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో తొలి రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 1,070 మంది, టీడీపీ అభ్యర్థులు 738 మంది, జనసేన అభ్యర్థులు 76 మంది, బీజేపీ అభ్యర్థులు 77 మంది, సీపీఎం అభ్యర్థులు 34 మంది, సీపీఐ అభ్యర్థులు 18 మంది ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లు.  

ఏకగ్రీవాల్లో వైఎస్సార్‌సీపీదే ఆధిక్యత
తొలి రోజు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్రంలో దాదాపు 245 డివిజన్లు/వార్డులు ఏకగ్రీవమైనట్టు అనధికారిక సమాచారం. ఏకగ్రీవాల్లో వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ఒక్కొక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. రాయచోటిలో 34 వార్డులకు గాను ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు అయిన వార్డులు 28 ఉన్నాయి. కడప కార్పొరేషన్‌లో 18 డివిజన్లలో ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవమయ్యేందుకు మార్గం సుగమమైంది. బుధవారం మధ్యాహ్నం 3 తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిౖకైన డివిజన్లు/వార్డుల విషయంలో స్పష్టత వస్తుంది.  

>
మరిన్ని వార్తలు