పరిషత్‌ ఎన్నికల రద్దు ఆదేశాలు నిలుపుదల

26 Jun, 2021 03:38 IST|Sakshi

ఓట్లు లెక్కించొద్దు.. ఫలితాలు వెల్లడించొద్దు 

ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం 

జూలై 27న తదుపరి విచారణ  

సాక్షి,అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. అయితే ఈ అప్పీల్‌పై తేలేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని, ఫలితాలను వెల్లడించరాదని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అప్పీల్‌పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ సింగిల్‌ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. 

సింగిల్‌ జడ్జి తప్పు చేశారు...! 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్‌ దాఖలు చేయగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశించాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు వేర్వేరుగా పిటిషన్లు వేశారని తెలిపారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేయాలని శ్రీనివాసరావు తన పిటిషన్‌లో  కోరలేదన్నారు. అయితే సింగిల్‌ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్‌ను కొట్టివేసి శ్రీనివాసరావు పిటిషన్‌లో ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలంటూ ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ విషయంలో సింగిల్‌ జడ్జి తప్పు చేశారని వివరించారు. ఈ సమయంలో జనసేన తరఫు న్యాయవాది వి.వేణుగోపాలరావు స్పందిస్తూ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని వాదనల సమయంలో న్యాయమూర్తి దృష్టికి తెచ్చామని చెప్పారు.

క్షుణ్ణంగా విచారణ అవసరం... 
ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆగస్టు మొదటి వారంలో విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొనగా జూలై మొదటి వారంలో చేపట్టాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన బ్యాలెట్‌ బాక్సులను తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏవీ లేవు కదా? అని ధర్మాసనం ప్రశ్నించగా తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని నిరంజన్‌రెడ్డి చెప్పారు. జూలై మొదటి వారంలో సాధ్యం కాదని, అనేక ముఖ్యమైన కేసులను ఆ వారంలో విచారించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 27న విచారణ జరుపుతామని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడే మిగిలింది.. 
నిరంజన్‌రెడ్డి వాదనలను కొనసాగిస్తూ ఇప్పటికే పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యాయని, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలి ఉందన్నారు. అందువల్ల సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టు తనకున్న అధికారాలను ఎన్నికల నిర్వహణకు ఉపయోగించాలే కానీ అడ్డుకునేందుకు వాడరాదన్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక∙అసాధారణ పరిస్థితుల్లో మినహా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి సంబంధించిన రాజ్యాంగంలోని అధికరణలు 243 ఓ, 329లకు సింగిల్‌ జడ్జి తనదైన శైలిలో భాష్యం చెప్పారని, అది ఎంతమాత్రం సరికాదన్నారు. 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అప్పీల్‌పై వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు వీలుగా నిర్దిష్టంగా ఒక తేదీని ఖరారు చేసి తుది విచారణ చేపట్టాలని కోరారు. 

మరిన్ని వార్తలు