దశాబ్దం తర్వాత నల్లమలలో తోడేళ్ల జాడ

4 Mar, 2023 04:18 IST|Sakshi

సంరక్షణకు అటవీశాఖ చర్యలు 

మార్కాపురం: పదేళ్ల కాలం అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో తోడేళ్ల కదలికలు కనిపించాయి. ఇటీవల దోర్నాల–ఆత్మకూరు సరిహద్దులోని రోళ్లపాడు వద్ద తోడేళ్లు కనిపించినట్లు అటవీశాఖ అధికారు­లు తెలిపారు. ప్రస్తుతం ఇవి దోర్నాల– ఆత్మకూరు–శ్రీశైలం అటవీ ప్రాంతాల మధ్య కొద్ది సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటి అరుపు కూడా ప్రత్యేకంగా ఉం­టుంది.

ఇవి గుంపులుగా సంచరిస్తూ..జింకలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లను చంపి తింటాయి. అ­త్యం­త వేగంగా పరిగెడతాయి. పాతికేళ్ల క్రితం మా­ర్కా­పురం, పెద్దారవీడు, తర్లుపాడు, అర్థవీడు, దో­ర్నా­­ల తదితర ప్రాంతాల్లో ఇవి ఉండేవి. పంట పొలా­లకు రక్షణ చర్యలో భాగంగా రైతులు కరెంటు తీగలు పెట్టడంతో జంతువుల్ని వేటాడేందుకు పొ­లా­ల్లోకి వ­చ్చి విద్యుత్‌ వైర్లు తగిలి చనిపోయి వాటి సంఖ్య క్రమే­పి తగ్గిపోయింది.

గడిచిన పదేళ్ల కాలంలో నల్లమలలో తోడేళ్ల జాడ లేకపోవడంతో పర్యావరణ ప్రేమి­కులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నెల క్రితం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో తోడేళ్ల జాడ ట్రాప్‌డ్‌ కెమెరాల్లో కనిపించింది. వాటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వన్య ప్రాణులను చంపవద్దు  
వన్య ప్రాణులను ఎవరూ చంపవద్దు. ఉచ్చులేసి వేటాడొద్దు. ఇటీవల రోళ్లపాడు ప్రాంతంలో తోడేళ్లు సంచరించాయి. రైతులు పొలాలకు విద్యుత్‌ కంచె వేయవద్దు. వన్య ప్రాణులను వేటాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  
– ఎ.విగ్నేష్, డిప్యూటీ డైరెక్టర్, అటవీ శాఖ   

మరిన్ని వార్తలు