అన్నార్తుల సేవలో.. కర్నూలు మహిళ 

10 Jan, 2022 14:03 IST|Sakshi
వలస కుటుంబాలతో అనిత  (ఫైల్‌)        

వివిధ దేశాల్లో విస్తృత కార్యక్రమాలు  

ఏడాది క్రితం సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం

కర్నూలు (ఓల్డ్‌సిటీ): అన్నార్తుల ఆకలి తీర్చే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఒకరు.. ఇద్దరు కాదు.. కొన్ని కోట్ల మంది అభాగ్యుల కాలే కడుపులు నింపింది. కట్టుబట్టలతో ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చిన వలస జీవులకు బాసటగా నిలిచింది. మూడేళ్ల క్రితం వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కర్నూలు నగరానికి చెందిన అనిత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో అన్నార్తులను ఆదుకున్నారు. 200 మంది సభ్యులతో వలస వెళ్లే కార్మికులు, సాధారణ పౌరులకు అండగా నిలిచారు. ఏడాది క్రితం ఆ సంస్థకు నోబెల్‌ శాంతి బహుమతి లభించగా ఆ సంస్థ హెడ్‌గా నైజీరియాలో ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బీజ్లి చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవల ఆమె కర్నూలు రాగా ‘సాక్షి’తో మాట్లాడారు.


         తల్లిదండ్రులు, భర్త, కుమార్తెతో..

‘మా నాన్న అర్థోపెడిషియన్‌ డాక్టర్‌ వెంకట శెట్టి నాకు స్ఫూర్తి. ఆయన 1,500 మందికి పోలియో ఆపరేషన్స్‌ ఉచితంగా చేశారు. ఆ చిన్నారులు, తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను. అరుదైన సేవలకు ఒక సార్థకత ఉంటుందని భావించి నేను సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం ప్రతినిధిగా ఎంపికయ్యాను. ఇటీవల ఆప్ఘనిస్తాన్‌లో సంభవించిన రాజకీయ పరిణామాలతో అక్కడి పౌరులు భారీ స్థాయిలో ఇతర దేశాలకు వలస వెళ్లిన క్రమంలో వాళ్లను వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం ఆత్మీయంగా గుండెలకు హత్తుకుంది. వాళ్లు ఎక్కడ విడిది చేస్తే అక్కడే గుడారాలు వేసి ఆహారాన్ని అందించింది.

గతంలో యెమెన్‌లో భారీ సంఖ్యలో (దాదాపు 2 కోట్ల మంది) వలసలు జరిగినప్పుడు డబ్ల్యూఎఫ్‌పీ వారిని ఆదుకుంది. నైజీరియా, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి ప్రజలు వలసవెళ్లిన సందర్భాల్లో ఆహారం సరఫరా చేయడంతో పాటు కొన్ని నెలల పాటు పునరావాసం కల్పించాం. ఏదైన దేశంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడి తమ మనుగడ ప్రమాదకరంగా మారినప్పుడు చాలా మంది వలస వెళ్తున్న సమయంలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక విడిది ఏర్పాటు చేస్తాం. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సరఫరా చేస్తాం. వలసదారులతో పనిచేసే క్రమంలో వాళ్లు మాట్లాడే హౌసా, ఇగ్లో, ఎరూబా భాషలను కూడా నేను నేర్చుకోగలిగా. నా భర్త హరికృష్ణ, కుమార్తె మేధా అందించిన సహకారం మరవలేనిది’ అని అనిత చెప్పారు.   

మరిన్ని వార్తలు