ఇంటర్యూలో సెలెక్ట్‌ అవలేదని యువతి అఘాయిత్యం.. వేర్వేరు కారణాలతో..

22 Apr, 2022 21:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రాణమంటే అలుసో? ప్రాణభయం లేకనో క్షణికావేశంలో కొంతమంది తప్పుడు నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడుతూ కుటుంబసభ్యులకు తీరని శోకం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వేర్వేరు కారణాలతో గురువారం నలుగురు ప్రాణాలు తీసుకుని కుటుంబసభ్యులను దుఃఖ సాగరంలో ముంచారు. ఆయా సంఘటనల వివరాలిలా ఉన్నాయి. 

ఉరివేసుకుని యువకుడు
పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కొత్తవలసలో గల కొత్త పోలమ్మ కాలనీకి చెందిన రౌతు చరణ్‌ (21) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై జిల్లా ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చరణ్‌ ఇంట్లో ఉరివేసుకుని ఉండడం గమనించిన అతని తల్లి వెంటనే  ఇరుగుపొరుగు వారి సహాయంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు తనిఖీ చేసి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు.  

పురుగు మందు తాగి మరొకరు
భోగాపురం రూరల్‌: మండలంలోని చేపలకంచేరు పంచాయతీ దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పూడి సూరిబాబు(30) కుటుంబ సమస్యలతో పురుగు మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూరిబాబు పురుగు మందు తాగిన విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబసభ్యుల  ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

ఇంటర్యూలో సెలెక్ట్‌ అవలేదని యువతి..
విజయనగరం క్రైమ్‌:  క్యాంపస్‌ ఇంటర్యూలో సెలెక్ట్‌ అవకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి సీ లింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరంలోని కేఎల్‌.పురంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వన్‌టౌన్‌ పోలీసులు  తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తల్లిదండ్రుల వద్ద ఉంటూ బీటెక్‌ నాలుగో  సంవత్సరం చదువుతున్న  ఎస్‌.శ్రావణి (22)కి 11 నెలల కిందట నరేంద్ర తో వివాహమైంది. భర్తకు జాబ్‌లేకపోవడం, తనకు ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతురాలి తల్లి వెంకట జయలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ ఎస్సై దుర్గాప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదో తరగతి విద్యార్థిని..
బొబ్బిలి:  పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. తండ్రి చనిపోయిన ఆ బాలిక  తాతగారింటి వద్ద ఉండి చదువుకుంటోంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా పదో తరగతి పరీక్షల సన్నద్ధతలో ఒత్తిడికి గురైందని, ఆరోగ్యం సరిగా లేదనే కారణాలు వినిపిస్తున్నాయి. స్థానికులు విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ విషయమై సీఐ ఎం నాగేశ్వర రావును వివరణ కోరగా ఎటువంటి సమాచారం లేదన్నారు.

►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు