ఆమెకు ‘కొరియా’ వ్యాధి.. ప్రమేయం లేకుండానే కదులుతున్న కాళ్లూచేతులు  

26 Jan, 2022 12:51 IST|Sakshi
చికిత్స కోసం వచ్చిన మహిళతో డాక్టర్‌ హేమంత్‌కుమార్‌  

నోట్లో ఆహారం పెడితే బయటకు తోస్తున్న నాలుక

సకాలంలో వైద్యం అందడంతో సాధారణ స్థితి 

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): ఆమె వయస్సు 32. కానీ చూడటానికి 50 ఏళ్లు పైబడిన మహిళగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడింది. కాళ్లు చేతులు తన ప్రమేయం లేకుండానే నిత్యం కదులుతూ ఉంటాయి. అన్నం తినేందుకు నోట్లో ముద్ద పెడితే.. తన ప్రమేయం లేకుండానే నాలుక ఆ ముద్దను బయటకు తోసేస్తుంది. ఇలాంటి వింతైన, అరుదైన పరిస్థితిని ఆస్పరికి చెందిన వీరేషమ్మ అనుభవిస్తోంది. వైద్యం చేయించాలని కుటుంబసభ్యులు కనిపించిన వైద్యులందరి వద్దకు తిరిగారు. మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం పట్టిందేమోనని భూతవైద్యులనూ ఆశ్రయించారు. ఇలా ఆ కుటుంబం దాదాపు మూడు లక్షల రూపాయలను ఖర్చు చేసింది.

చివరకు కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ ఆదోని క్యాంపునకు వెళ్లినప్పుడు కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఆమెకు గల పరిస్థితిని అర్థం చేసుకుని వైద్య పరీక్షల కోసం హోల్‌ ఎక్సీమ్‌ సీక్వెన్సింగ్‌ జెనటిక్‌ టెస్ట్‌ను అహ్మదాబాద్‌కు పంపించారు. నెలరోజుల స్టడీ అనంతరం వైద్యపరీక్షల నివేదిక రెండురోజుల క్రితం డాక్టర్‌కు అందింది. ఆమెకు కొరియా అకాంటో సైటోసిస్‌ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్‌ 13ఎ అనే జీన్‌ మ్యూటేషన్‌ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్‌ చెప్పారు.

చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..)

నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.       

మరిన్ని వార్తలు