అంత్యక్రియలను అడ్డుకున్న ‘పంచాయతీ’

25 Feb, 2021 05:32 IST|Sakshi
వృద్ధురాలి శవంతో రోడ్డుపై నిరీక్షిస్తున్న బంధువులు

బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ‘పంచాయతీ’ ఎన్నికల సంగ్రామం ముగిసినప్పటికీ.. ఇంకా గ్రామాల్లో ఆ నిప్పుల కుంపటి చల్లారలేదు. ఎన్నికల సందర్భంగా తనకిచ్చిన మాట తప్పారనే కారణంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ.  వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామంలో శ్మశానం పంట పొలాల మధ్యలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పొలాల్లో నుంచే మృతదేహాలను శ్మశానానికి తీసుకెళుతున్నారు. బుధవారం ముత్యాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి బయలు దేరారు. అయితే పొలాల దారి మొదట్లో కాపురం ఉంటున్న బుజ్జమ్మ తన పొలం దారి నుంచి శవాన్ని తీసుకెళ్లవద్దంటూ దారికి అడ్డంగా కంచెను ఏర్పాటు చేసింది.

సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పుడు ఏకగ్రీవంగా తమను ఎన్నుకుంటా మని, గ్రామానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్మానం చేసి..అనంతరం మాట తప్పి పోటీ పెట్టి మోసం చేశారని, కాబట్టి తన  భూముల నుంచి శవాన్ని తీసుకుపోయేందుకు వీల్లేదని బుజ్జ మ్మ అడ్డుకుంది. దీంతో వృద్ధురాలి శవంతో మూడు గంటల పాటు ఎండలో రోడ్డుపైనే బంధువులు నిరీ క్షించాల్సి వచ్చింది. విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడం తో ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు గణేష్, ఎస్‌ఐ ధర్మారెడ్డి  ఘటనాస్థలానికి చేరుకుని బుజ్జ మ్మకు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు