పది నిమిషాల్లో బియ్యం కార్డు

20 Sep, 2020 04:32 IST|Sakshi
రేషన్‌ కార్డుతో పాటు ఆదాయ, భర్త మరణ ధ్రువీకరణ పత్రాలను చూపుతున్న అంజమ్మ

యర్రగొండపాలెం/ఉంగుటూరు(గన్నవరం)/రామచంద్రపురం రూరల్‌: దరఖాస్తు చేసిన పదంటే పది నిమిషాల్లో ఓ మహిళ బియ్యం కార్డు అందుకుంది. ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగినా రాని కార్డు.. ఇప్పుడు నిమిషాల్లో రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీనికి కారణమైన వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లికి చెందిన దూపాటి అంజమ్మకు దశాబ్దాల కాలంగా రేషన్‌ కార్డు లేదు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది.

ఆమెకు బియ్యం కార్డు లేదన్న విషయం తెలుసుకున్న వలంటీర్‌ శనివారం ఉదయం 11.28 గంటలకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేయించాడు. సరిగ్గా 11.38 గంటలకు ఆమెకు బియ్యం కార్డును అందించారు. అలాగే వితంతు పింఛన్‌ కోసం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీ పెట్టిన అరగంటలో ఆ పత్రాన్ని అందుకుంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందాడు. మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఈ నెల 17న దరఖాస్తు చేయగా.. శనివారం వలంటీర్‌ ఇంటికి వెళ్లి సర్టిఫికెట్‌ను అందించాడు. అలాగే కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన కాటం ఓబేదు, మదిచెర్ల మేరీగ్రేస్, బొంతు జోజిబాబులు దరఖాస్తు చేసుకున్న పావుగంటలో బియ్యం కార్డు అందుకున్నారు. 

మరిన్ని వార్తలు