మహిళను రక్షించిన దిశ యాప్‌

19 Jul, 2021 03:48 IST|Sakshi

భార్యపై దాడిచేసి తల పగలగొట్టిన భర్త

పెనమలూరు: ఆపదలో ఉన్న ఓ మహిళను దిశ యాప్‌ ఎనిమిది నిమిషాల్లోనే ఆదుకుని అండగా నిలిచింది. కృష్ణా జిల్లాలో తనపై దాడిచేసి తల పగలగొట్టిన భర్తపై ఓ వివాహిత దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిమిషాల వ్యవధిలో చేరుకుని బాధితురాలిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బాధితురాలు షేక్‌ హీరుతున్నీసా 2018లో ఇంజనీరింగ్‌ కాలేజీ అధ్యాపకుడు ఇస్మాయిల్‌ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

పెళ్లి సమయంలో కట్నకానుకలు అందచేశారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త, అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. బాధితురాలికి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం రావటంతో వీరంకిలాకులో కాపురం ఉంటున్న సమయంలో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిని తాళలేక పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. కేసు రాజీ కుదరటంతో నాలుగు నెలల నుంచి పోరంకి బాలాజీనగర్‌లో నివసిస్తున్నారు. అయితే అత్తింటి వారిలో మార్పు రాలేదు. అదనపు కట్నం కోసం వేధిస్తూ బాధితురాలిని హింసిస్తున్నారు.

బాధితురాలిని కాపాడిన దిశ యాప్‌..
ఆదివారం మధ్యాహ్నం హీరుతున్నీసాపై భర్త ఇస్మాయిల్‌ దాడి చేసి తలపగలగొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు దిశ యాప్‌లో మధ్యాహ్నం 3.10 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సత్యనారాయణ రక్షక్‌ వాహనంలో వెంటనే సిబ్బందిని పంపడంతో ఫిర్యాదు అందిన 8 నిమిషాల్లోనే  ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసుల రాకతో ఇస్మాయిల్‌ పరారయ్యాడు. తలకు తీవ్రగాయం కావడంతో బాధితురాలిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దిశ యాప్‌ తన ప్రాణాలు కాపాడిందని బాధితురాలు పేర్కొంది. భర్త, అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు