ఫోన్‌ కాల్‌తో పరిష్కారం

17 Jan, 2021 04:51 IST|Sakshi

మహిళల ఫిర్యాదులపై ‘పోలీస్‌’ స్పందన 

గృహహింస బాధితులకు కొండంత భరోసా

ఆపదలో ఉన్న మహిళల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై తక్షణ చర్యలు

ఏడాదిలో డయల్‌ 100కు 25 వేల కాల్స్‌

డయల్‌ 112కు 1,438 కాల్స్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌తో మహిళలకు చట్టబద్ధమైన పరిష్కారం లభిస్తోంది. ఏ మహిళకు కష్టమొచ్చినా వెంటనే పోలీస్‌ సహాయాన్ని కోరే స్థాయికి చైతన్యం పెరిగింది. రాష్ట్రంలో డయల్‌ 100, డయల్‌ 112, దిశ కాల్‌ సెంటర్లకు లభిస్తున్న స్పందనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న ఏపీ పోలీస్‌ శాఖ.. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపడుతోంది. ప్రధానంగా అత్తమామలు, ఆడపడుచు, భర్త పెట్టే గృహహింస కేసులపై పోలీసులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. గడచిన ఏడాది కాలంలో గృహహింస కాల్స్‌ అధికంగా వస్తుండగా.. వాటిపై పోలీసు శాఖ తక్షణ చర్యలు చేపడుతుండటం విశేషం. మహిళలు, విద్యార్థినులు డయల్‌ 100, 112, దిశ కాల్‌ సెంటర్‌ను పెద్ద సంఖ్యలోనే వినియోగించుకుంటున్నారు. 

అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ..
మహిళలపై వేధింపులు, దాడులు వంటి తదితర అంశాలకు సంబంధించి 100, 112, దిశ కాల్‌ సెంటర్‌లలో దేనికైనా ఫోన్‌కాల్‌ వచ్చిన క్షణం నుంచే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. కాల్‌ సెంటర్‌లో ఫిర్యాదు ఆటోమేటిక్‌గా వాయిస్‌ రికార్డు అవుతుండగా.. కాల్‌ సెంటర్‌ సిబ్బంది బాధితురాలు ఉండే ప్రాంతానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తక్షణమే సమాచారం అందిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్న పోలీస్‌ టీమ్‌ బాధిత మహిళలకు తక్షణ సాయం అందించే చర్యలు చేపడుతోంది. గృహహింస వంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేధింపులు తదితర నేరాలపై గట్టి చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. బాధిత మహిళల సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. కౌన్సెలింగ్, హెచ్చరికలు, బైండోవర్‌ వంటి పద్ధతుల్లో నిందితులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కేసుల్లో బాధిత మహిళ కోరితేనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు