పెరుగుతున్న ఆయుష్షు

8 May, 2022 03:21 IST|Sakshi

పురుషులకంటే మహిళల జీవిత కాలం ఎక్కువ

రాష్ట్రంలో 2011–15లో స్త్రీల ఆయుర్దాయం 71.2 ఏళ్లు 

2031–35 నాటికి 75.6 ఏళ్లకు పెరుగుదల

జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక 

సాక్షి, అమరావతి: మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రజల జీవిత కాలం పెరుగుతోంది. ప్రధానంగా పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. 2031–35 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, స్త్రీ, పురుషుల ఆయర్దాయంపై నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మగవాళ్ల కన్నా ఆడవాళ్ల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. రాష్ట్రంలో 2011–15 మధ్య మహిళల ఆయుర్దాయం 71.2  సంవత్సరాలుండగా 2031–35 మధ్య 75.6 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేసింది.

రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 67.1 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.4 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే పురుషులకంటే స్త్రీల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువ ఉంటుందని నివేదిక వెల్లడిస్తోంది.  దేశంలో 2011–15 మధ్య స్త్రీల ఆయుర్దాయం 70 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 74.7 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 66.9 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా.

దేశంలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక 

దేశం మొత్తంమీద కేరళ రాష్ట్రంలోనే పరుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుందని అంచనా వేశారు. కేరళలో మహిళల ఆయుర్దాయం 2031–35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల ఆయుర్దాయం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్‌లో పురుషుల, స్త్రీల ఆయుర్దాయం అత్యల్పంగా ఉంటుందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో 2031–35 మధ్య పురుషుల ఆయుర్దాయం 69.4 సంవత్సరాలు,  మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో ఏటేటా పురుషులు,  స్త్రీల ఆయుష్షు పెరుగుతుందని నివేదిక తెలిపింది. 

పెరుగుతున్న వృద్ధులు
అన్ని రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుతుండటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు జనం ఆయుర్దాయం పెరుగుతుండటం దీనికి కారణమని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4 శాతం ఉంది. 2031–35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు