భర్త కోసం మౌన పోరాటం 

26 Aug, 2020 09:14 IST|Sakshi

సాక్షి, అనంతపురం :  ‘పరాయి మహిళ మోజులో పడి నా భర్త నన్ను కాదంటున్నాడు.. పోలీసులు, పెద్ద మనుషులు పంచాయితీ చేసినా వినిపించుకోలేదు... న్యాయం కోసం వస్తే అత్తింటి వారు గెంటేశారు’ అని జానగాని వరలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని హంపాపురంలో ఉన్న తన భర్త ఇంటి ముందు ఆమె భర్త, ఇద్దరు కుమారులు కావాలని దీక్షకు కూర్చుంది. ఆమెకు పలువురు మహిళలు బాసటగా నిలిచారు.

జానగాని వరలక్ష్మి తెలిపిన వివరాలమేరకు.. బుక్కరాయసముద్రం మండలం బాట్లో కొత్తపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారై వరలక్ష్మిని హంపాపురానికి చెందిన కాటమయ్య, ఆదెమ్మల కుమారుడు జానగాని సాంబశివాతో 2013లో వివాహం చేశారు. రూ.4 లక్షలు , 16 తులాల బంగారు నగలు కట్నకానులు ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్‌ (7), కౌసిక్‌ (5) సంతానం. సాంబశివ అనంతపురంలో ఫొటో స్టూడియో పెట్టుకుని జీవనం చేస్తున్నాడు. పెళ్లి అయిన ఐదేళ్లు అతను భార్యతో బాగానే ఉన్నాడు. అయితే అతని ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమె భర్తపై నిఘా పెట్టగా అనంతపురంలో ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది.

ఈ విషయమై వరలక్ష్మి భర్తను ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. ఈ విషయంపై పోలీసులు సాంబశివకు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. భార్య తనను పోలీసులతో కొట్టించిందన్న కోపంతో భర్త ఇద్దరు కుమారులను తీసుకొని అనంతపురానికి వెళ్లాడు. నాలుగు నెలల పాటు భర్త ఇంట్లోనే ఉంటున్నా భర్త, పిల్లలు గ్రామానికి తిరిగి రాకపోయే సరికి ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి నాలుగు నెలలు అవుతున్న ఒక పక్క భర్త, మరో పక్క పిల్లలు గుర్తుకు రావడంతో మరోసారి ఆత్మహత్యయత్నం చేసుకోబోయింది. ఆఖరికి మంగళవారం ఉదయం హంపాపురానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె అత్త ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో భర్త ఇంటి ముందే దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. ఇరువురిని పిలిపించి విచారిస్తామని, అవసరమైతే జానగాని వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు