అన్నదాతలకు ఆత్మస్థైర్యమై..

19 May, 2022 18:14 IST|Sakshi

రైతులకు సాగు మెళకువలు నేర్పుతున్న మహిళలు

నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లోనే రైతులతో మమేకం 

రైతులకు సాగు మెళకువలు నేర్పుతున్న మహిళలు

నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లోనే రైతులతో మమేకం

ఆత్మకూరు (చేజర్ల):  వ్యవసాయ రంగంలో మహిళలు గురువుల పాత్ర పోషిస్తున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు సంబంధించి భూమిని సాగుకు సిద్ధం చేయడం దగ్గరి నుంచి.. నూర్పిడి, విత్తనాల నిల్వ వరకు వ్యవసాయ క్షేత్ర సహాయకులుగా, అధికారులుగా, శాస్త్రవేత్తలుగా బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అండగా ఉంటూ విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పంటల్లో నూతన ప్రయోగాలు చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంపై ఆసక్తితో అభ్యసించిన చదువు పది మందికి ఉపయోగపడాలనే ఆశయంతో ఈ రంగాన్ని ఎంచుకుని పలువురు క్షేత్ర సహాయకుల నుంచి శాస్త్రవేత్తల వరకు రాణిస్తున్నారు.     

జిల్లాల పునర్విభజన అనంతరం 10,441 చదరపు కి.మీ. విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా అవతరించిన సింహపురి.. అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. జిల్లాలోని 38 మండలాల్లో దాదాపు 15 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వరితో పాటు ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. ఆయా శాఖల్లో అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు 291 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో అత్యధికులది వ్యవసాయ కుటుంబ నేపథ్యం కాగా, మరి కొందరు ఉద్యోగ, వ్యాపార నేపథ్య కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు.  

జిల్లాలోని 38 మండలాల్లో (కొత్తగా కలిసిన కందుకూరుతో కలిపి) వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో 50 శాతానికి పైగా మహిళలే పని చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఏఆర్‌సీ), కిసాన్‌ వికాస్‌ కేంద్రం (కేవీకే)ల్లోనూ మహిళలే అధికంగా ఉన్నారు.

సేద్యంలో.. సేవల్లో సంపూర్ణం 
వ్యవసాయశాఖలో బహుముఖ పాత్రలు పోషిస్తున్న మహిళలు సేవల్లో సంపూర్ణతగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పారదర్శకంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకే చేరేలా బాధ్యత వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో వాటి అమలు కోసం నిత్యం రైతుల మధ్యనే వ్యవసాయాధికారిణులు సిబ్బంది ఉండాల్సిన పరిస్థితి. 

అను నిత్యం రైతులతో మమేకమై వారి అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ఉత్తమ అవార్డులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. వీరు పురుషులకు దీటుగా తమ విధులు నిర్వహిస్తూ పలువురికి వ్యవసాయంపై ఆసక్తి కలిగేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.      

రైతులు ఆనందంగా ఉండాలి
నా తండ్రి రాజశేఖర్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో మేనమామ పీర్ల సుబ్బయ్య నన్ను చదివించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. దీంతో నాకు వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. ఎంతో కష్టపడే రైతులు ఆనందంగా ఉండాలంటే వారికి ప్రభుత్వ సహకారం, అధికారుల అండదండలు తప్పనిసరి. రైతులకు సేవలు అందించే ఈ ఉద్యోగంలో చేరేందుకు నాకు స్ఫూర్తిగా నిలిచింది. యనమదల ఆర్బీకేలో రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులందరికీ అందేలా చేస్తున్నా. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పొలాలకే వెళ్లి పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాను.   
– వీ హేమలత, ఏఏఓ, యనమదల  

రైతుల అభ్యున్నతికి కృషి
మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు వెంకటరమణయ్య, వెంకటసుబ్బమ్మ. కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం మా స్వగ్రామం. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయశాఖలో ఉద్యోగం సంపాదించి వారి అభ్యున్నతికి నా వంతు కృషి చేద్దామని ఆసక్తితో ఈ విధుల్లో చేరా. సొంత మండలంలోనే ఆరేళ్లు ఏఓగా పని చేసి నా శక్తి మేర రైతులకు సహకరించాను. ప్రస్తుతం ఏడీగా ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లో రైతుల అభివృద్ధి కోసం ఏఓలను, ఏఏఓలను సమాయత్తం చేస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాను. మహిమలూరులో రైతులను ప్రోత్సహించి గతంలో కంటే ఎక్కువ ధాన్యం దిగుబడులు సాధించేలా చేయడం నాకు సంతోషం కలిగించిన విషయం. నా సేవలను గుర్తించి ఉత్తమ వ్యవసాయాధికారిణిగా జిల్లా స్థాయిలో అవార్డు సాధించడం మరువలేని విషయం.  
– వట్టూరు దేవసేన, ఏడీ, ఆత్మకూరు నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యం 

మా తల్లిదండ్రులు పెద్ది పోశయ్య, కొమరమ్మలతో చిన్న వయస్సు నుంచే తోటల్లో తిరగడం నాకు అలవాటు. దీంతో వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. జిల్లాలోని కొన్ని భూముల్లో నీటి లభ్యత తక్కువగా ఉండడం, ధాన్యం తదితర పంటలు ఆ భూముల్లో సాగు చేసే కంటే ఉద్యానవన పంటల సాగుకు ఆ భూములు అనుకూలంగా ఉండడంతో ఆ దిశగా గ్రామాల్లో రైతులను ప్రోత్సహించి నాణ్యమైన ఉత్పత్తులు సాధించే లక్ష్యంతో కృషి చేస్తున్నాను. జిల్లాలో సుమారు 38 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. రైతలకు పెరిగిన సాంకేతిక గురించి వివరిస్తూ ఉద్యానవన పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి ఉపయోగపడేలా చేస్తున్నా. నా పరిధిలోని మూడు మండలాల్లో నిమ్మ, మామిడి, సపోటా, జామ, బొప్పాయి తోటలు సాగవుతున్నాయి. ఉద్యానవన సాగు కోసం రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను వారికి అందేలా చేయడంలో సహకరిస్తున్నాను.                     
  – ఉద్యానవనశాఖ అధికారిణి, పెద్ది లక్ష్మి, చేజర్ల 

ఇష్టంతో చేస్తున్నా 
మా తాతయ్య దగ్గర పెరుగుతూ ఏఎస్‌పేట మండలం గుంపర్లపాడులో ఆయనతో కలిసి పొలాలకు వెళ్తూ ఉండడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగం సైతం రైతులకు అందుబాటులో ఉంటూ ఇష్టంతోనే పని చేస్తున్నాను. నా ఆర్బీకే పరిధిలో రైతులకు అందుబాటులో ఉంటూ సబ్సిడీ పథకాలతో వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు వారికి అందేలా చూస్తున్నా. గతంలో బట్టేపాడు ఆర్బీకే కేంద్రంలో పని చేస్తున్న క్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఏఏఓగా అవార్డు పొందాను. దీంతో విధులపై మరింత బాధ్యత పెరిగింది. మా తండ్రి మల్లెం కొండయ్య, వసంతమ్మ ఆత్మకూరులో చిన్న నాటి వ్యాపారం చేస్తున్నారు. నేను చేజర్ల మండలం మడపల్లి ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్నాను.   
 – ఏ మమత, ఏఏఓ, మడపల్లి 

మరిన్ని వార్తలు