ఇదేమి ఖర్మ!: టీడీపీ నేత ప్రశ్నలు.. దిమ్మతిరిగేలా జనం జవాబులు

17 Dec, 2022 05:08 IST|Sakshi
టీడీపీ నేతలను నిలదీస్తున్న మహిళలు

శ్రీరంగరాజపురం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం ఆ పార్టీ నేతలకు షాక్‌ ఇచ్చింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం మండలం వీవీపురం పంచాయతీ పరిధిలోని ఆరిమాకులపల్లెలో శుక్రవారం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చిట్టిబాబునాయుడు స్థానిక మహిళలకు వేసిన ప్రశ్నలకు వారు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆయన అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. ‘అదేంటి.. ఈ ఊరోళ్లు ఇలా మొహం మీదే మాట్లాడుతున్నారు’ అంటూ టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌ నాయుడు, ఇతర నేతలు గుండయ్య, వెంకటరమణ, రవి, సిద్దయ్య తదితరులు చిట్టిబాబునాయుడును అనుసరించారు. స్థానిక మ­హి­ళలు, టీడీపీ నేత మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. 

టీడీపీ నేత : సకాలంలో పింఛన్లు అందుతున్నాయా? 
మహిళలు : ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుతుండగానే వలంటీర్‌ వచ్చి నిద్రలేపి.. మరీ అందిస్తున్నారు 
టీడీపీ నేత : అందరికీ ఇవ్వడం లేదట కదా? 
మహిళలు : మాకందరికీ ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా రాకపోతే పెట్టుకోండని (దరఖాస్తు చేసుకోవాలని) చెబుతున్నారు. 
టీడీపీ నేత : మిగతా పథకాలు అందుతున్నాయా? 
మహిళలు : అన్నీ అందుతున్నాయి. 
టీడీపీ నేత : రోడ్లు అసలు బాగున్నాయా? 
మహిళలు : మీ హయాంలోనే గుంతలు పడ్డాయి. ఇప్పుడు బాగు చేశారు కదయ్యా.. 
టీడీపీ నేత : రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటేనే మేలు కదా? 
మహిళలు : ఏం మేలు? మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి.. మీకేంటి అభ్యంతరం? 
టీడీపీ నేత : పథకాలకు డబ్బులు అడుగుతున్నారా? 
మహిళలు : అప్పట్లా జన్మభూమి కమిటీల్లేవు. ఎవరూ రూపాయి అడగడం లేదు. నేరుగా మా ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి. అందుకే జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.  

మరిన్ని వార్తలు