ఎండిన ఆకులకు జీవ'కళ'

29 May, 2022 04:36 IST|Sakshi
లీఫ్‌ ఆర్ట్‌ వేస్తున్న శ్రావణ్‌

రావి చెట్టు ఆకు స్కెలిటన్‌పై అద్భుత చిత్రాలు

‘లీఫ్‌ ఆర్ట్‌’ తో అబ్బురపరుస్తున్న విజయవాడ కళాకారుడు 

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): చెట్ల నుంచి రాలిన ఆకులు వాడిపోయి ఎండిపోతాయి. కొన్నాళ్లకు కుళ్లిపోతాయి. ప్రకృతిలో నిత్యం మనం చూసే తంతే. కానీ..లీఫ్‌ ఆర్టిస్ట్‌ శ్రావణ్‌ చేతిలో ఆ ఎండిన ఆకులే జీవం పోసుకుంటాయి. కళాఖండాలై చిగురిస్తాయి. నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటాయి. శాశ్వతమై నిలిచిపోతాయి. రావి చెట్టు ఆకుల అస్థిపంజరాల (లీఫ్‌ స్కెలిటన్‌పై) చూడచక్కని బొమ్మలు గీస్తూ అరుదైన ఈ కళ (లీఫ్‌ఆర్ట్‌)ను పోషిస్తున్నాడు విజయవాడ నగరానికి చెందిన శ్రావణ్‌.   

లీఫ్‌ ఆర్ట్‌..  
రావి చెట్టు పచ్చి ఆకులను సేకరించాలి. వాటిని కొద్దిరోజులపాటు నీటిలో నానబెట్టాలి. బాగా నాని కుళ్లిన తర్వాత ఆకు ఈనెలపై ఉండే గుజ్జును సున్నితంగా బ్రష్‌తో తొలగించాలి. ఆకుపై గుజ్జును పూర్తిగా తొలగించిన తర్వాత అది స్కెలిటన్‌గా (అస్థిపంజరం) మారుతుంది. దానిని పేపర్ల మధ్య పెట్టి డ్రై చేయాలి. అలా డ్రై చేసిన తరువాత ఏర్పడే ‘లీఫ్‌ స్కెలిటన్‌’ ఉల్లిపొరలా పలుచగా తయారవుతుంది. వాటిపై అందమైన బొమ్మలను గీయడం ‘లీఫ్‌ ఆర్ట్‌.

రావి చెట్టు ఆకు స్కెలిటన్‌పై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రం 

ఆకు స్కెలిటన్‌పై మహాత్మాగాం«ధీ, స్వామి  వివేకానంద, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, మదర్‌థెరిసా, ఛత్రపతి శివాజీ, పొట్టి శ్రీరాములు, ఏపీజే అబ్దుల్‌ కలాం, మహానేత వైఎస్సార్, సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రాలు గీశాడు శ్రావణ్‌. రాజకీయ నాయకులు, దేవతలు, సినీ తారలే కాకుండా వ్యక్తులు కూడా తమ బొమ్మలను ఆకులపై గీయించుకుని ఫ్రేమ్‌ తయారు చేయించి భద్రపరుచుకుంటున్నారు.

స్కూల్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తా..   
ఆకులను పుస్తకాల మధ్యలో పెట్టి కొన్నాళ్ల తర్వాత తీస్తే వాటిలో పత్రహరితం పోయి ఎండిపోయి కనిపించేవి. అలా ఓ చిన్న పాప చేయడం చూసి వీటిపై బొమ్మలు గీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి బొమ్మలు గీయడం స్టార్ట్‌ చేశాను. లీఫ్‌ స్కెలిటన్‌ ఆర్ట్‌ చేస్తే బాగుంటుందని భావించి ఇలా చేస్తున్నా. నాకు తెలిసిన ఈ కళను మళ్లీ ప్రాచుర్యంలోకి తేవాలని పట్టుదలతో పనిచేస్తున్నా. తెలిసిన కళను చిన్నారులకు నేర్పిస్తున్నా. ఆసక్తి ఉన్న పిల్లలకు ప్రస్తుతం ఉచితంగా శిక్షణనిస్తున్నా. ఈ కళలో అద్భుతాలు సృష్టించి ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయలనేది నా కల.  
– ఇట్టా శ్రావణ్, లీఫ్‌ ఆర్టిస్ట్‌ 

పర్యావరణ హితం.. 
లీఫ్‌ ఆర్ట్‌ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉండాలి. ఉల్లిపొరలా పలుచగా, సున్నితంగా తయారైన లీఫ్‌ స్కెలిటన్‌ను జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి. ఏ మాత్రం అటుఇటైనా ఆకు చిరిగిపోతుంది. పైగా పెన్నుతో ఆర్ట్‌ వేయాల్సి ఉంటుంది. బొమ్మ వేయడం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఏకాగ్రత ఉండాలి.  ఈ కళలో శ్రావణ్‌ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 
– శ్రీనివాస్, స్ఫూర్తి క్రియేటివ్‌ ఆర్ట్స్‌ 

మరిన్ని వార్తలు