ఒంగోలు సిటీ.. ఇదిగో అభివృద్ధి

9 Jan, 2023 12:19 IST|Sakshi
ఒంగోలు నగర పరిధి పీర్లమాన్యంలో పూర్తయిన డాక్టర్‌ వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం

మూడున్నరేళ్లలో రూ.137.79 కోట్లతో పనులు

ఒంగోలు నగరంలో వేగంగా అభివృద్ధి పనులు

మౌలిక వసతుల కల్పన దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

కొనసాగుతున్న ‘అమృత్‌’ పథకం పనులు

నేడు మేయర్‌ గంగాడ అధ్యక్షతన 2023–24 బడ్జెట్‌ సమావేశం

రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్‌ సమావేశం

అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరం రూపురేఖలు మారుతున్నాయి. నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడున్నరేళ్లలో రూ.137.79 కోట్లు వెచ్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని ప్రతి ఇంటింటికీ తిరుగుతూ డివిజన్లలోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. నూతన నగర పాలకమండలి ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్‌ నేడు ప్రవేశపెట్టనున్నారు. 

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగరం సమగ్ర అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని విస్తరిస్తున్న నగరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజల అవసరాలు తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు కూడా మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నగర ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఒంగోలు నగరంలో బాలినేని మార్క్‌ అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చేయటమే లక్ష్యంగా యంత్రాంగాన్ని ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగర జనాభా 3,01,572 మందికి చేరింది. 

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బాలినేని ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో వేలాది మంది అర్హులైన పేదలు, మధ్య తరగతి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇంటింటికీ వెళుతున్న బాలినేనికి స్వయంగా లబ్ధిదారులు ‘ఇది మీరు ఇచ్చిన ఇల్లే వాసన్నా’ అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.  


11వ డివిజన్‌లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లకు శంకుస్థాపన చేస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, పక్కన మేయర్‌ గంగాడ (ఫైల్‌) 

కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలు నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో మొత్తం 50 డివిజన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టేందుకు 1013 పనులు మంజూరు చేశారు. అందుకుగాను రూ.101.67 కోట్ల సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయటానికి పూనుకున్నారు. వాటిలో ఇప్పటికే 641 పనులు పూర్తయ్యాయి. మరో 71 పనులు కొనసాగుతున్నాయి. 301 పనులు ప్రారంభించాల్సి ఉంది.  

2019 నుంచి 2022 వరకు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ సబ్‌ ప్లాన్‌ కింద మొత్తం రూ.కోటి వెచ్చించి 12 పనులు చేపట్టి పూర్తి చేశారు. ఎంపీ లాడ్స్‌ కింద రూ.20 లక్షలు వెచ్చించి నాలుగు పనులు పూర్తి చేశారు. 

2019–20 ఆర్థిక సంవత్సరానికి 14వ ఫైనాన్స్‌ కింద మంచినీటి సరఫరా పనులతో పాటు మొత్తం 3 పనులకు రూ.6.84 కోట్లు వెచ్చించారు.

2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను 15వ ఆర్థిక సంఘంలో భాగంగా మొత్తం 29 పనులు చేపట్టారు. అందుకుగాను రూ.16.87 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో 6 పనులు పూర్తి కాగా మరో 14 పనులు ప్రారంభించాల్సి ఉంది.  

ఒంగోలు నగరంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నూతనంగా ఐదు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు మంజూరయ్యాయి. ఒక్కో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు ప్రభుత్వం రూ.80 లక్షల చొప్పున మంజూరు చేసింది. వాటిలో కొన్ని పూర్తికాగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో నాలుగు పాత అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఒక్కో దానిని రూ.10 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారు. నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం కింద ఆరు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.58 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 20 పనులు మంజూరు చేసింది.

అందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇప్పటికే 11 పనులు ప్రారంభించి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల్లో భాగంగా మూడు పనులకు గాను రూ.22.95 లక్షలు మంజూరు చేశారు. వాటిలో రెండు పనులు జరుగుతున్నాయి. మరొక పనిని ప్రారంభించాల్సి ఉంది. జగనన్న హరిత నగరాల్లో భాగంగా ఒంగోలు నగరంలో మొక్కలు నాటడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూ.2.62 కోట్లు కేటాయించారు. పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికలు ప్రారంభించారు. గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన మంచినీటి పథకం అమృత్‌ మొదటి విడత పనులు రూ.75 కోట్లతో కొనసాగుతున్నాయి.

రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వైనం
2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం జరగనున్న ఒంగోలు నగర పాలక సంస్థ పాలక మండలి రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మేయర్‌ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశ మందిరంలో బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాలక మండలి ఏర్పాటైన తరువాత ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. ఆదాయం, రాబడులు, జీతాలు, ఒంగోలు నగర పాలక సంస్థ నిర్వహ ణ, అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అన్నీ కలుపుకొని రూ.196 కోట్ల ఖర్చు లు పోను రూ.13 కోట్ల మిగులుతో కౌన్సిల్‌ ఆమోదించనుంది. 

మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు 
ఒంగోలు నగరంలో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నాం. నగర శివారు ప్రాంతాల్లోనూ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాం. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను రూపొందించాం. కౌన్సిల్‌ సమావేశంలో చర్చ అనంతరం ఆమోదింపజేసుకొని ముందుకు సాగుతాం. 
– ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ  

మరిన్ని వార్తలు