Vizag Chennai Industrial Corridor: వైజాగ్‌–చెన్నై కారిడార్‌ పనులు చకచకా 

27 Jan, 2022 04:21 IST|Sakshi

రెండున్నరేళ్లలో రూ.508.61 కోట్ల విలువైన పనులు పూర్తి 

తొలి దశ పనులకు రూ.2,278.61 కోట్లు 

రెండో దశ పనులకు రూ.2,599.56 కోట్లు 

సాక్షి, అమరావతి:  రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలకమైన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.5,544 కోట్లతో రెండు దశల్లో ఈ కారిడార్‌ పనులు జరుగుతున్నాయి. తొలి దశ కింద రూ.2,278.61 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే రూ.815.17 కోట్ల విలువైన పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు తుది దశలో ఉన్నాయి.

గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.306.56 కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే.. గడచిన రెండున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.508.61 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది.  ఇందులో ఇప్పటికే నాయుడుపేట క్లస్టర్‌లో 1 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి యూనిట్, శ్రీకాళహస్తి–ఏర్పేడు క్లస్టర్‌కు సంబంధించి విద్యుత్‌ సరఫరా పనులు పూర్తయ్యాయి. నాయుడుపేట, అచ్యుతాపురం క్లస్టర్‌కు సంబంధించి నీటి సరఫరా, విద్యుత్‌ వంటి కీలక మౌలిక వసతులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేవిధంగా ఏపీఐఐసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.  

మొదలైన రెండో దశ పనులు 
కాగా, రూ.2,599.56 కోట్లతో రెండో దశకు సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ చేపట్టింది. మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4,125 కోట్లు రుణం రూపంలో సమకూర్చనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,419 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద విశాఖ నోడ్‌లో నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, చిత్తూరు సౌత్‌ బ్లాక్‌ నోడ్‌లో 13,319 ఎకరాలు, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద 2,596 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తున్నారు.

ఒక్కసారి వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి ఏడు రెట్లు, రాష్ట్ర జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా. 2015లో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి 2035 నాటికి రూ.7,82,300 కోట్లకు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11.60 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అదనంగా 1.10 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా.   

మరిన్ని వార్తలు