World Animal Day: పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..

4 Oct, 2021 08:02 IST|Sakshi

నల్లమలలో ఏటా పెరుగుతున్న జంతువులు  

కొండ గొర్రెలు, హని బాడ్జర్‌ ప్రత్యేకం 

పచ్చిక బయళ్లను ఆక్రమిస్తున్న వెదురు తోపులు 

మైదాన ప్రాంతాలకు తరలుతున్న జింకలు 

నేడు ప్రపంచ జంతు దినోత్సవం 

సాక్షి, ఆత్మకూరురూరల్‌: తూర్పు కనుమల్లో విస్తరించిన నల్లమల అడవులు జీవ వైవిధ్యానికి ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగా నిలిచాయి. సింహం, ఏనుగు మినహా అన్ని రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. మాంసాహార, గడ్డి తినే జంతువులతో పాటు పలు సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు, పక్షులు ఉన్నాయి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, వన్యప్రాణి వేటగాళ్లను కట్టడి చేయడంతో అడవిలో జంతుజాలం అలరారుతోంది. ఏటా జంతువులసంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు.

మాంసాహార జంతువులలో ప్రముఖమైన పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు మొత్తం 17 రకాలు, తొమ్మిది రకాల గడ్డి తినే జంతువులు ఉన్నాయి. అంతరించి పోయే దశలో ఉన్న పెద్దపులులతో పాటు అరుదైన జీవజాలానికి నెలవుగా ఉన్న కొండగొర్రెలు (చౌసింగా) తన ఉనికిని చాటుతూ నల్లమల అటవీ సాంద్రతను నిరూపిస్తున్నాయి. అలాగే నిశాచరి అయిన హనీబాడ్జర్‌ కూడా  ప్రత్యేకంగా నిలుస్తోంది.

అటవీ పరిధిలోని కృష్ణానది, పలు కొండవాగుల్లో, నీటిదొరువుల్లో సరీ సృపాలకు చెందిన మొసళ్లు జీవిస్తున్నాయి. అలాగే భారీ తాబేళ్లు (టోలిలు) కూడా ఉన్నాయి. నెమలి, కొండ కోడి (గ్రే జంగిల్‌ పౌల్‌), హార్న్‌బిల్‌ వంటి 200 రకాల అరుదైన పక్షుల కిలకిలరావాలతో నల్లమల పులకిస్తోంది.

ఇవే గాక 13 రకాల గబ్బిలాలు, బెట్టుడత లాంటి ఉడుత జాతి జంతువులు, ఎలుక జాతులు, సాలెపురుగు, చెదపురుగులు వంటి లెక్కలేని కీటకాలు ఉన్నాయి. అయితే వెదురు తోపులు పచ్చిక బయళ్లను ఆక్రమించడంతో జింకలు ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరులుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నల్లమలలో తరచూ కనిపించే జింకలు ఇప్పుడు సమీపంలోని రోళ్లపాడు అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు.     

విఫలమైన గడ్డి పెంపకం.. 
నల్లమలతో పాటు చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాల్లో కూడా పశువుల సంఖ్య గణనీయంగానే ఉంది. 2001 లెక్కల ప్రకారం అడవిలో 5.81 లక్షల వన్యప్రాణులు ఉండగా సమీప గ్రామాల్లో (3 కిమీ లోపు) 6.24 లక్షల పెంపుడు జంతువులు ఉన్నాయి. వీటిల్లో గడ్డితినే జంతువులన్నింటికీ నల్లమలనే ఆధారం. నల్లమలలో 1,33,122 హెక్టార్ల గడ్డి లభించే ప్రాంతం ఉండగా.. ఏటా సుమారు 3,86,053 టన్నుల గడ్డి లభ్యమవుతోంది. ఇప్పుడున్న జంతువులకు  6.934 లక్షల టన్నుల గడ్డి అవసరం కాగా 3.073 టన్నుల కొరత ఉంది. వేసవిలో గడ్డి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో సమస్య పరిష్కారానికి అధికారులు  అడవిలో ఏర్పాటు చేసిన సోలార్‌ పంప్‌సెట్ల వద్ద గడ్డి పెంచే చర్యలు చేపట్టారు. అయితే నాటిన గడ్డి మొక్కలను జంతువులు వేర్లతో సహా పెకిలించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దేశంలోని కొన్ని అభయారణ్యాలలో గడ్డి మైదానాలను పెంచేందుకు వెదురు పొదలను తొలగించిన సందర్భాలున్నాయి. గడ్డి తినే, మాంసాహార జంతువుల మధ్య సమతుల్యం లోపిస్తే పర్యావరణ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

మాంసాహార జంతువులు..  
పెద్దపులి, చిరుతపులి, జంగం పిల్లి, ఆకుచిరుత, చేపలుపట్టే పిల్లి, రస్టీస్పాటెడ్‌ క్యాట్, పునుగు పిల్లి, కామన్‌ పామ్‌సివిట్, ముంగీస, నీటికుక్క(ఆటర్‌), హానీబాడ్జర్, ఎలుగు బంటి, నక్క, గుంటనక్క, చారల హైనా (దొమ్ములగొండి), తోడేలు, రేచుకుక్క (వైల్డ్‌డాగ్‌).  

గడ్డి తినే జంతువులు:  
దుప్పి (స్పాటెడ్‌ డీర్‌), కణితి (సాంబర్‌ డీర్‌), మనిమేగం (నీల్‌గాయ్‌), కృష్ణజింక (బ్లాక్‌బక్‌), బుర్ర జింక (మౌస్‌డీర్‌), కొండగొర్రె(చౌసింగా), చింకారా, అడవి పంది (వైల్డ్‌బోర్‌), ముళ్ల పంది (మిశ్రమ ఆహార జంతువు. చెద పురుగులు తిని జీవిస్తుంది.)   

కొండ గొర్రె
కొండ గొర్రెలు మైదాన ప్రాంతాల్లో కాక దట్టమైన అడవుల్లో పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి జింక జాతికి చెందినవైనప్పటికీ మూషిక జింకకు, కృష్ణజింకకు మధ్యరకం పరిమాణంతో ఉంటాయి. రెండు కొమ్ములు నిటారుగా మరో రెండు చిన్న కొమ్ములు ముందుకు ఉంటాయి. మొత్తం నాలుగు కొమ్ములు ఉండటంతో దీనికి చౌసింగా అన్న పేరు వచ్చింది. దీని మాంసం రుచికరంగా ఉంటుందన్న అపోహతో వేట గాళ్ల దృష్టి వీటిపై ఎక్కువగా ఉండేది. అధికారులు నిఘా పెంచడంతో వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.  

  

హనీబాడ్జర్‌  
వన్యప్రాణుల టీవీ చానల్స్‌లో తరుచూ కనిపించే హనీబాడ్జర్‌ను ఆఫ్రికా జంతువుగా చాలా మంది భావిస్తారు. ఇది రాత్రి పూట మాత్రమే సంచరించడంతో నల్లమల ప్రాంత ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియలేదు. అందుకే దీనికి తెలుగు పేరు కూడా లేకుండా పోయింది. బిలకారి జీవనం చేసే హనీబాడ్జర్‌లు మానవ సామాజిక వ్యవహారానికి దగ్గరగా తమ జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. భూమి లోపల నివాసం ఏర్పరుచుకుని పెద్దవి, పిల్లలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తాయి. అలాగే తమ నివాసం వెలుపల మల విసర్జనకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి అవసరమై సమయంలో పెద్దపులికి కూడా ఎదురుతిరిగే సాహసం చేస్తాయి. 

మరిన్ని వార్తలు