World Arthritis Day 2021: వామ్మో..నొప్పి! 

12 Oct, 2021 09:26 IST|Sakshi

35 ఏళ్లకే కీళ్ల నొప్పులు

వ్యాయామం చేయకపోవడంతో తిప్పలు 

పోషకాహారం తీసుకోకపోవడంతో సమస్యలు   

నేడు అంతర్జాతీయ ఆర్థరైటిస్‌ దినం 

కర్నూలు(హాస్పిటల్‌): కూర్చుంటే లేయలేరు.. కూసింత దూరంగా కూడా పరుగెత్తలేరు.. వీరంతా వయస్సు మళ్లివారంటే పొరబడినట్లే. మూడు పదులు దాటిన వయస్సులోనే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు. జిల్లాలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో 50 నుంచి 60 ఏళ్ల యవస్సు ఉన్న వారికి  ఈ జబ్బు కనిపించేది. ఇప్పుడు 35 ఏళ్ల వారిని కూడా ఈ వ్యాధి వేధిస్తోంది. గత పదేళ్లుగా జిల్లాలో ఆర్థరైటిస్‌(కీళ్లనొప్పుల) కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. రోజుకు సగటున 560 మందికి పైగా కొత్త రోగులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లా జనాభాలో వ్యాధి పీడితుల సంఖ్య 8 శాతానికి పైగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  

జీవన శైలి మారడమే ప్రధాన కారణం..
ఆర్థరైటిస్‌ రావడానికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులేనని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్‌ తినడం..పోటీ ప్రపంచంలో ఒత్తిడి పెరగడం తదితర కారణలతో ఊబకాయం వచ్చి.. ఆర్థరైటిస్‌ దారితీస్తోంది.  రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, యాంకైలోసింగ్‌ స్పాండిలైటిస్‌ అనే కీళ్లజబ్బులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొందరికి జన్యుపరంగా ఇవి వ్యాపిస్తున్నాయని  వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి నివారణకు వ్యాయామం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. 30 ఏళ్ల మనిషి రోజుకు కనీసం 3 కిలోమీటర్లు నడవాలి. అప్పుడు మృదులాస్తి పునరుత్పత్తి జరిగి కీళ్లనొప్పులు రావు. వారానికి కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయాలి. పొగతాగకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీరానికి తగ్గట్టు బరువుండాలి.     

నిర్లక్ష్యం చేయొద్దు
ఆర్థరైటిస్‌ ఒకసారి వస్తే అంత త్వరగా వదిలిపెట్టవు. దీనిని పూర్తిగా నిర్మూలించలేం. స్టెరాయిడ్స్, నొప్పి నియంత్రణ మందులు వాడటం వల్ల నియంత్రించవచ్చు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోతే పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఫలితంగా గుండెకు చేటు. అలాగేæ శరీర మెటబాలిజం తగ్గి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థరైటిస్‌ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. చివరిదశలో కాళ్లు వంగిపోయి, ఎముకలు విరిగిపోయే పరిస్థితిలోనే ఆపరేషన్‌ చేయించుకోవాలి.
–డాక్టర్‌ పి. కిరణ్‌కుమార్, కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్, కర్నూలు 


ఉపశమన చికిత్స ప్రధానం
రోగి అనుభవిస్తున్న నొప్పి మొత్తాన్ని తగ్గించడం, కీళ్లకు అదనపు నష్టాన్ని నివారించడం ప్రధానం. కొందరికి తాపన ప్యాడ్‌లు, ఐస్‌ప్యాక్‌లు ఉపశమనం కలిగిస్తాయి. మరికొందరికి వాకర్స్‌ వంటి పరికరాలు నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మందులతో కూడిన చికిత్సలు, శస్త్రచికిత్సలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లనొప్పులు ఉన్న వారికి ఈత మంచి వ్యాయామం.   –డాక్టర్‌ జీవీఎస్‌ రవిబాబు, కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, కర్నూలు 

మూలికలతో వైద్యం
ఆయుర్వేద రస శాస్త్రంలో గుగ్గులుతో కూడిన మూలికా మిశ్రమాలతో కలిగిన ఔషధాలు ఉన్నాయి. ఇందులో కాంచన, త్రిఫల, త్రయోదశాంగ, కైశోర, నవక, పంచతిక్త, అమృతాది, గోక్షురాది, మహారాజ, సింహనాద, రాన్సాది గుగ్గులు ఉన్నాయి. ఇవి కీళ్లవాతం, సంధివాతం, వెన్నుముక సమస్యలు, చర్మరోగాలు, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. ఆయుర్వేద ఔషధ మూలికల్లో శొంఠిపొడి, నల్లనువ్వులు, ఆముదం చెట్టు బెరడు, గింజలు, వేర్లు, కరక్కాయ, తిప్పతీగ, నల్లేరు, పారిజాతం మొక్క, మెంతాకు, రావి చెక్క, వావిలి, మునగాకు ముఖ్యమైనవి. నియామానుసారం ఆహార, విహార, రుతు నియమాలు పాటిస్తే అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవచ్చు.        
–డాక్టర్‌ పద్మనాభరెడ్డి, సీనియర్‌ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు 

మరిన్ని వార్తలు