సీఎం జగన్‌కు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కృతజ్ఞతలు

1 Jun, 2022 03:56 IST|Sakshi

క్లిష్ట సమయంలో దావోస్‌లో మీ సహకారం ముఖ్యమైనది

ఏపీ నుంచి మీ సహకారం కోసం ఫోరం ఎదురు చూస్తోంది

సీఎం జగన్‌కు డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండే లేఖ

సాక్షి, అమరావతి: ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. ‘చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు’ అనే ఇతివృత్తంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా అత్యంత సవాల్‌గా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాల్లో సమావేశం జరిగిందని, ప్రపంచానికి ఈ క్లిష్ట సమయాన దావోస్‌లో వ్యూహాత్మక సంభాషణల్లో మీ (సీఎం జగన్‌) సహకారం చాలా ముఖ్యమైనదని ఫోరం అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండే ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

వాతావరణ మార్పు వంటి సమస్యలపై సమిష్టి చర్యలను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడం, శాంతి, ఆర్థిక పునరుద్ధరణను కాపాడటంపై సదస్సులో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రభుత్వ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన 2,500 మందిని ఈ సమావేశం ఒకచోట చేర్చిందన్నారు. వార్షిక సమావేశంలో బలమైన స్వరంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు సీఎం జగన్‌కు ఫోరం ధన్యవాదాలు తెలిపింది.

దావోస్‌లో మీ (సీఎం జగన్‌) అనుభవం ఫలవంతమైందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మీ నిరంతర సహకారం కోసం ఫోరం ఎదురుచూస్తుందని తెలిపింది. గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్స్, ఫోరం మూవింగ్‌ ఇండియాతో అనుసంధానమైందని, గ్రీన్‌ మొబిలిటీకి పరివర్తనను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ చొరవ ఎంతో దోహదపడుతుందని ఫోరం తెలిపింది.  

మరిన్ని వార్తలు