Chicken Eggs: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

14 Oct, 2022 20:02 IST|Sakshi

మండపేట(కోనసీమ జిల్లా): గుప్పెడంత ఉండే గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు కలిగిన సూపర్‌ ఫుడ్‌గా గుడ్డును పేర్కొంటారు నిపుణులు. భారత పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్థాల్లో గుడ్డు మొదటిది కావడం గమనార్హం. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే గుడ్డు లక్షలాది మందికి ఉపాధి చూపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది.
చదవండి: రైతు ట్రెండీ ఐడియా.. పంట పొల్లాల్లో హీరోయిన్ల ఫొటోలు పెట్టి..!

రెండున్నర దశాబ్దాల క్రితం లండన్‌ కేంద్రంగా అంతర్జాతీయ గుడ్లు సమాఖ్య (ఐఈసీ) ఆవిర్భవించింది. ఆరోగ్య పరిక్షణలో గుడ్డు ప్రాధాన్యతను వివరించడమే లక్ష్యంగా ఏటా అక్టోబర్‌ రెండో శుక్రవారం ఐఈసీ ప్రపంచ గుడ్డు దినోత్సవం నిర్వహిస్తోంది. జాతీయ గుడ్లు సమ్వయ కమిటి (ఎన్‌ఈసీసీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా  వరల్డ్‌ ఎగ్‌ డే వేడుకలు నిర్వహిస్తుంటారు.

పోషకాలివీ.. 
50 గ్రాముల గుడ్డులో ఎనర్జీ 72 కేలరీలు ఉంటే, 6.3 గ్రాముల ప్రొటీన్లు, 4.8 గ్రాముల కొవ్వు, 28 గ్రాముల కాల్షియం, 0.9 గ్రాముల ఐరెన్, విటమిన్‌ ఏ 270 ఐయూ, విటమిన్‌ డి 41ఐయూ ఉంటాయి. శరీరానికి కావాల్సిన మరెన్నో పోషకాలు గుడ్డులో లభిస్తాయి  
గుడ్డులో ఉండే విటమిన్‌ ఏ ఆరోగ్యకరమైన కణాల వృద్ధికి, చర్మం, కళ్లు వాటి కణజాలకు ఎంతో అవసరం
గుడ్డులో ఉండే విటమిన్‌ బి–12 ఎర్ర రక్తకణాల తయారీకి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.  
కొలిన్‌ శరీరంలోని నాడీ, కండరాల వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది.  
ఫోలిక్‌ ఆసిడ్‌ ఎర్ర రక్తకణాల తయారీకి, గర్భవతుల్లో పిండం పెరుగుదలకు, ఐరెన్‌ శరీరంలో ఆక్సిజన్‌ సరఫరాకు ఉపయోగపడుతుంది. కండరాల నిర్మాణం, అవయవాలు, చర్మం, ఇతర కణజాలాల నిర్మాణానికి, హార్మోనులు, ఎంజైములు, యాంటీబాడీల తయారీకి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది
గుడ్డులోని సెలీనియం ఆరోగ్యకరమైన రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది
ఆరోగ్యకరమైన ఎముకలు, పళ్ల నిర్మాణానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరస్‌ను తట్టుకునేందుకు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రధాన పౌష్టికాహారంగా కోడిగుడ్డుకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది.

వేల మందికి ఉపాధి  
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, అనపర్తి, ద్వారపూడి, బలభద్రపురం, పెద్దాపురం, రావులపాలెం, రంగంపేట, రాజమహేంద్రవరం రూరల్‌ ప్రాంతాల్లో పరిశ్రమ విస్తరించింది. 200 పౌల్ట్రీలు ఉండగా గుడ్లు పెట్టేవి, పిల్లలు తదితర దశల్లో దాదాపు 2.20 కోట్ల కోళ్లు ఉన్నాయి. గుడ్లు పెట్టే కోళ్లు దాదాపు 1.3 కోట్లు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక గుడ్ల ఉత్పత్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతుండటం గమనార్హం.

ఇక్కడి ఉత్పత్తిలో 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సొం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. కోళ్లకు మేత వేయడం, నీళ్లు పెట్టడం, మందులు అందజేయడం, గుడ్ల రవాణా, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు

కోడిగుడ్డులో పోషకాలు పుష్కలం   
శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంలో గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు, కండర నిర్మాణానికి మేలు చేస్తుంది.  
– పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు  

మరిన్ని వార్తలు