WHO Health Policy: ఉప్పుతో ముప్పు తప్పదు!

11 May, 2021 04:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోజుకు 5 గ్రాములు మించితే ప్రమాదం

గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులొచ్చే ప్రమాదం

2025 నాటికి 30 శాతం ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి

ఆరోగ్య విధాన పత్రంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ

సాక్షి, అమరావతి: ఉప్పు లేని  పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా ఆరోగ్య విధానపత్రంలో స్పష్టం చేసింది. మోతాదుకు మించి ఉప్పు తింటే గుండెజబ్బులు, ఊబకాయం, లివర్, మూత్రపిండాల వ్యాధులొస్తాయని ప్రకటించింది. పలు దేశాల్లో ప్రయోగాల అనంతరం ఈ విషయాన్ని పేర్కొంది. 

ప్యాక్డ్‌ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువే..
అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్‌ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్‌ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది.  

ఉప్పుకు మరోపేరే సోడియం క్లోరైడ్‌.. 
ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్‌. శరీరంలోని నీటి పరిమాణాన్ని సోడియం నియంత్రించే ఖనిజం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్‌ కాన్సర్, లివర్‌ సిరోసిన్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.

ప్రజలకు అవగాహన కలిగించాలి..
ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రజలు రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) తినాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. 2025 నాటికి 30 శాతం ఉప్పును తగ్గించాలన్నది 2013లో ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన దిశలో ప్రస్తుత ప్రపంచం లేనట్టుగా ఉందని ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.   

ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి  
ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. షుగర్‌ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారే మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి.
– డాక్టర్‌ విజయసారథి 

మరిన్ని వార్తలు