ప్రపంచ ఐటీ చూపు.. విశాఖవైపు చూసేలా..

25 Dec, 2022 04:36 IST|Sakshi
మీడియా సమావేశంలో శ్రీధర్‌ కొసరాజు, నారాయణ, లక్ష్మి

జనవరి 21, 22 తేదీల్లో ‘ఇన్ఫినిటీ వైజాగ్‌–2023’ సదస్సు 

హాజరుకానున్న అంతర్జాతీయ ఐటీ సంస్థల ప్రతినిధులు 

ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ వెల్లడి  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నంలో పుంజుకుంటున్న ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా ‘ఇన్ఫినిటీ వైజాగ్‌–2023’ పేరుతో నగరంలో జనవరి 20, 21 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ (ఐటాప్‌) అధ్యక్షుడు శ్రీధర్‌ కొసరాజు తెలిపారు. విశాఖలోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఉన్న వనరులు, అవకాశాలపై రోడ్‌ మ్యాప్‌ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వాటికి విశాఖలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని, అందువల్లే ఈ ప్రాంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్‌ చేసేందుకు సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇన్ఫినిటీ వైజాగ్‌–2023’ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తంచేశారని చెప్పారు. సదస్సులో తొలిరోజు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలపై, రెండో రోజు బీపీవో కంపెనీలపై చర్చలు ఉంటాయని వివరించారు.

ఏపీలో ప్రస్తుతం ఐటీ ఎగుమతులు సుమారు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐటాప్‌ పూర్వ ప్రెసిడెంట్‌ ఆర్‌ఎల్‌ నారాయణ మాట్లాడుతూ సదస్సులో భాగంగా ఎస్‌టీపీఐ ఆధ్వర్యంలో ఐటీ ఇండస్ట్రీస్‌ అవార్డులు, స్టార్టప్‌ అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.

ఐటాప్‌ కాబోయే అధ్యక్షురాలు లక్ష్మి ముక్కవెల్లి మాట్లాడుతూ ఇన్ఫినిటీ వైజాగ్‌ సదస్సులో బాస్, టెక్‌ మహింద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, సైబర్‌ సెక్యూరిటీ, ఐశాట్‌ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని  చెపారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగస్వాములుగా నాస్‌కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ చాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ–హబ్‌ వ్యవహరించనున్నాయని వివరించారు. 

మరిన్ని వార్తలు