ఈవీ..‘పొగ’బెట్టవు

28 Aug, 2022 05:37 IST|Sakshi

ఇక భవిష్యత్తు అంతా.. కాలుష్య రహిత వాహనాలదే

ఊపందుకుంటున్న విద్యుత్‌ వాహనాల తయారీ

దేశంలో 4 లక్షల వాహనాలు

ఇప్పటికే విద్యుత్‌ కార్లను తయారుచేస్తున్న టాటా    

రంగంలోకి మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి, ఓలా

లిథియం అయాన్‌ బ్యాటరీ ఆధారిత విద్యుత్‌ వాహనాలదే హవా

సాక్షి ప్రతినిధి, అమరావతి: ప్రపంచం కాలుష్య రహిత వాహనాల వైపు చూస్తోంది. ప్రస్తుతం వాడుతున్న పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలూ కార్యాచరణలోకి దిగాయి. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) తయారీని ప్రారంభించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బ్యాటరీల మేళవింపుతో ఈ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.

భారత దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సులూ వస్తున్నాయి. ముంబైలో బ్యాటరీతో నడిచే డబుల్‌ డెక్కర్‌ బస్సును ఇటీవలే ప్రవేశపెట్టారు. దేశంలో బ్యాటరీ కార్ల తయారీ కూడా మొదలైంది. ఈవీల ధరలు ఎక్కువగా ఉండటం మార్కెట్లో పెద్ద సవాలుగా మారింది. అయితే, వీటి వినియోగంతో కాలుష్యంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. విద్యుత్‌ వాహనాలపట్ల ప్రజలు ఆకర్షితులు కావడానికి ఇదే ప్రధాన కారణం.

విద్యుత్‌ కార్లకు ఉన్న డిమాండ్‌ను, అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో ప్రధాన కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. టాటా కంపెనీ ఇప్పటికే విద్యుత్‌ కార్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 2024–26 మధ్య ఐదు కొత్త మోడల్స్‌ కార్లు తెస్తామని మహీంద్రా ప్రకటించింది. ఆన్‌లైన్‌ ట్యాక్సీ వ్యాపారం చేసే ‘ఓలా’, ఇప్పటికే విద్యుత్‌ స్కూటర్లు తయారుచేస్తోంది. రెండేళ్లలో విద్యుత్‌ కార్లు కూడా తెస్తామని ప్రకటించింది. దేశంలో కార్ల తయారీలో నంబర్‌–1 స్థానంలో ఉన్న మారుతి కూడా విద్యుత్‌ కారు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ కంపెనీలవన్నీ లిథియం అయాన్‌ బ్యాటరీ ఆధారిత వాహనాలే. విద్యుత్‌ వాహనాల్లో ఇది విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం.

ఈవీల వినియోగంలో చైనా టాప్‌
ప్రయోగ దశ దాటి విద్యుత్‌ వాహనాలను పెద్ద సంఖ్యలో తయారుచేయడం 2010లో  ప్రారంభమైంది. ‘ఈవీ’ల వాణిజ్య ఉత్పత్తి తొలుత ‘నిసాన్‌’ ప్రారంభించింది. నిసాన్‌ లీఫ్‌ తొలి ఈవీ వాహనం. 2012లో ‘టెస్లా మోడల్‌ ఎస్‌’ రోడ్డెక్కడంతో మిగతా సంస్థలూ వీటి తయారీ మీద దృష్టి పెట్టాయి. 2011లో ప్రపంచవ్యాప్తంగా 55 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. పదేళ్ల తర్వాత వీటి సంఖ్య 70 లక్షలకు చేరింది. అందులో సగం వాటా చైనాది. ఈవీల వినియోగంలో అమెరికా, ఐరోపా దేశాలను మించి చైనా దూసుకుపోతోంది.

భారత్‌లో సగం ద్విచక్ర వాహనాలు
2021లో దేశంలో 3.29 లక్షల విద్యుత్‌ వాహనాలు రోడ్డెక్కితే, అందులో 48 శాతం ద్విచక్ర వాహనాలే. మరో 45 శాతం ఆటో రిక్షాలు ఉన్నాయి. కార్లు 4 శాతం ఉండగా, ఎలక్ట్రిక్‌ బస్సులు, ఇతర వాహనాల వాటా 3 శాతం. ప్రజా, సరకు రవాణా వాహనాల సంఖ్య పెరిగితేనే కాలుష్యం తగ్గుదల ఎక్కువగా ఉంటుంది. డీజిల్, పెట్రోల్‌ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గుతాయి. ఇటు పర్యావరణ పరిరక్షణకు, అటు విదేశీమాదక ద్రవ్యం మిగులుకు ఇది దోహదం చేస్తుంది.

ధరలు ఎక్కువగా ఉండటమే అసలు సమస్య
విద్యుత్‌ వాహనాల ధరలు సాధారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ. ద్విచక్ర వాహనాల ధరలు మరీ ఎక్కువగా లేకపోవడం, ఇంధన వ్యయం తక్కువగా ఉండటం వల్లే టూవీలర్ల విక్రయాలు పెరుగుతున్నాయి. లోస్పీడ్‌ ఆటో రిక్షాల ధరలూ మరీ ఎక్కువగా లేవు. ఈవీ కార్లు, బస్సుల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా తయారయిన వాహనాల మీద 28 శాతం జీఎస్‌టీ ఉండగా, విద్యుత్‌ వాహనాలకు 5 శాతం వసూలు చేస్తున్నారు.

అయినప్పటికీ ఈవీల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాటరీ ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. దేశంలో బ్యాటరీ తయారీకి విదేశీ కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అరువు తెచ్చుకోవాలి. మన సొంత టెక్నాలజీతో బ్యాటరీలు తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

బ్యాటరీ తయారీలో సవాళ్లు ఎన్నో..
లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో ప్రధానంగా లిథియం, మాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్‌ (రాగి), అల్యూమినియం, గ్రాఫైట్, టైటానియం అనే 8 ఖనిజాలు అవసరం. మన దేశంలో మాంగనీస్, నికెల్, కాపర్, అల్యూమినియం నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. గ్రాఫైట్‌ నిల్వలూ ఉన్నప్పటికీ, ముడి ఖనిజం నుంచి బ్యాటరీ తయారీకి అవసరమయ్యే నాణ్యమైన గ్రాఫైట్‌ను తయారు చేసే కర్మాగారాలు లేవు. వాటిని ఏర్పాటు చేసుకుంటే గ్రాఫైట్‌ తయారు చేసుకోవచ్చు.

దేశంలో ఉన్న టైటానియం మన అవసరాలకు సరిపోతుందో లేదో ఇంకా అంచనా వేయలేదు. లిథియం, కోబాల్ట్‌ మన దేశంలో లేవు. ఈ రెండింటినీ పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. దేశంలో లభించే ఖనిజం ఉత్పత్తి, వీటిని లిథియం అయాన్‌ బ్యాటరీల్లో వినియోగానికి అనుగుణంగా మార్చుకోవడంపై ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు దృష్టి పెట్టాలి. దేశంలో లభించని లోహాలను ఏ రూపంలో దిగుమతి చేసుకోవాలనే విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి.

ముడి ఖనిజం దిగుమతి చేసుకొని ఇక్కడ లోహాలు ఉత్పత్తి చేయాలన్న భావన ఉంది. లోహం కాన్సంట్రేట్‌ను దిగుమతి చేసుకొని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా చౌకగా, వేగంగా అందుబాటులోకి తేవాలన్న వాదనా ఉంది. వివిధ దేశాల్లో ‘క్లీన్‌ ఎనర్జీ’ లోహాల మైనింగ్, ఉత్పత్తి ఉన్నా, చైనా మార్కెట్‌ లీడర్‌గా ఎదిగింది. ఆయా లోహాల ముడి ఖనిజం నిల్వలు చైనాలో లేకున్నా, ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని సమకూర్చుకొంది. ఇదే తరహాలో మనమూ ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటే బ్యాటరీల్లో వినియోగించే కీలక లోహాల కొరత లేకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు