World Piles Day 2022: పైల్స్‌కు స‘మూల’ పరిష్కారం..

19 Nov, 2022 19:32 IST|Sakshi

పైల్స్‌ వ్యాధి బారిన పడుతున్న యువత, ఉద్యోగులు

అందుబాటులో ఆధునిక పద్ధతులు  

నవంబర్ 20న ప్రపంచ మొలల దినం 

గుంటూరు మెడికల్‌: ఆధునిక జీవన శైలి వల్ల ప్రస్తుతం ప్రజలు యుక్త వయసులోనే మూలవ్యాధి(పైల్స్‌/మొలలు) బారిన పడుతున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ రోగులు ఎక్కువగా కూర్చోలేరు. అలాగని తిరగనూ లేరు. గుంటూరు జీజీహెచ్‌ జనరల్‌ సర్జరీ వైద్య విభాగానికి ప్రతిరోజూ పది మంది పైల్స్‌ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు.

గుంటూరు జిల్లాలో 120 మంది జనరల్‌ సర్జన్లు, పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ సగటున ఇద్దరు మొలల బాధితులు చికిత్స కోసం వస్తున్నట్టు సమాచారం. హెమోరాయిడ్స్‌గా పిలిచే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ నవంబర్‌ 20న వరల్డ్‌ పైల్స్‌ డేని నిర్వహిస్తున్నారు. సరైన వైద్యం తీసుకుంటే మూలవ్యాధిని సమూలంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.  

కారణమేంటంటే..  
మల విసర్జన సరిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఇది ఎక్కువగా ఉండేవారిలో అన్నవాహిక చివరి భాగంలో మల ద్వారానికిపైన పురీషనాళం వద్ద రక్తనాళాల్లో వాపు చోటుచేసుకుంటుంది. దీనినే మూల వ్యాధి అంటారు. కొందరిలో మలద్వారం దగ్గర  సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఆస్కారం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, మద్యపానం, నీరు తక్కువగా తాగడం, మాంసాహారం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్‌ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. మల ద్వారం చుట్టూ దురదగా ఉండడం, మల విసర్జన సమయంలో వాపు, ఉబ్బు తగలడం, అధిక రక్తస్రావం దీని లక్షణాలు.   

చికిత్స, జాగ్రత్తలు  
► ప్రస్తుతం మూలవ్యాధికి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్టాప్లర్, లేజర్, హాల్స్‌వంటి విధానాల వల్ల ఎక్కువ నొప్పి, గాయం లేకుండా మూలవ్యాధిని నయం చేయొచ్చు.  

► మొలలు సోకిన వారు  పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ప్రత్యేకంగా నీళ్లను తరచూ తాగాలి. పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మల విసర్జన చేయకూడదు. కారం, మాసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు, దుంప కూరలకు దూరంగా ఉండాలి.


90 శాతం మందులతోనే నయం

పైల్స్‌ బాధితులకు గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆపరేషన్లూ చేస్తున్నాం. నూటికి 90 శాతం మూలవ్యాధి మందులతోనే నయమవుతుంది. కేవలం పది శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఆపరేషన్‌కూ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. లేజర్‌ చికిత్స ద్వారా అతి తక్కువ కోత, కుట్లతో శస్త్రచికిత్స చేయొచ్చు.   
– షేక్‌ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్‌

మరిన్ని వార్తలు