World Stroke Day 2021: ఆ.. 60 నిమిషాలు విలువైనవి  

29 Oct, 2021 08:51 IST|Sakshi
బ్రెయిన్‌ స్ట్రోక్‌ సిమ్టమ్స్‌  

బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి 

80 శాతం మందిలో రక్తనాళాల్లో గడ్డలతోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌  

15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లడం కారణం 

పోస్ట్‌ కోవిడ్‌ రోగులకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు  

ప్రపంచ స్ట్రోక్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం

సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వారిని తొలి గంట సమయంలోపు ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాపాయం తప్పినట్లే. కనీసం నాలుగున్నర గంటల్లోపు వస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఇప్పుడు మూడు పదుల వయసు వారిలోనూ కనిపిస్తోంది. పోస్ట్‌ కోవిడ్‌ రోగులు ఎక్కువగా స్ట్రోక్‌ బారిన పడుతున్నారు. ఈ ఏడాది వరల్డ్‌ స్ట్రోక్‌డే సందర్భంగా ‘ప్రాణాలు కాపడటంలో ప్రతి నిమిషం విలువైనదే’ అనే నినాదంతో అవగాహన కలిగించనున్నారు. శుక్రవారం ప్రపంచ స్ట్రోక్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. 

విజయవాడకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేన్నాడు. అతను కోవిడ్‌ నుంచి కోలుకున్న ఇరవై రోజులకు మూతి వంకర పోవడంతో పాటు, కాలు, చేయి పట్టుకోల్పోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వెంటనే అతనికి రక్తంలో గడ్డలు కరిగేందుకు ఇంజక్షన్‌ ఇవ్వడంతో స్ట్రోక్‌ ముప్పు నుంచి బయట పడ్డాడు. కోవిడ్‌ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఓ 25 ఏళ్ల యువకుడికి బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఆ ఫంగస్‌ మొదడు రక్తనాళాల్లో గడ్డలుగా ఏర్పడటంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. వీళ్లిద్దరే కాదు ఈ ఏడాది ఎంతో మంది పోస్టు కోవిడ్‌ రోగులు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు.

చదవండి: (Health Tips: ఈ విటమిన్‌ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..)
 
స్ట్రోక్‌ లక్షణాలు ఇవీ.. 
మూతి వంకర పోవడం, కాలూచేయి పనిచేయక పోవడం, మాట ముద్దగా, నత్తిగా రావడం, మాటలో తేడా రావడం, నియంత్రణ తప్పడం, మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోలేక పోవడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఒకటి రెండుగా కనిపించడం, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

80 శాతం మందికి క్లాట్స్‌ కారణం 
సాధారణంగా మధుమేహం, రక్తపోటు, కొలస్ట్రాల్‌ స్థాయి ఎక్కువగా ఉండటం, సిగిరెట్లు, మద్యం తాగే వారిలో స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో రక్తంలో గడ్డ (క్లాట్‌)లు కట్టే అవకాశం ఎక్కువ. జన్యుపరంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి, గుండె సంబంధిత వ్యాధులు వారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్టు కోవిడ్‌ రోగుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ రోగులు కూడా స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెపుతున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మందిలో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడటమే, మరో 15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లడం కారణం. రక్తనాళాల్లో గడ్డలతో స్ట్రోక్‌కు గురయ్యే వారు సకాలంలో ఆస్పత్రికి చేరితే మంచి ఫలితం ఉంటుంది. నాలుగున్నర గంటల్లోపు రక్తనాళాల్లో గడ్డలు కరగడానికి ఇంజక్షన్స్‌ ఇవ్వడం ద్వారా స్ట్రోక్‌ ద్వారా వచ్చే వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంది.  

ప్రతి నిమిషమూ విలువైనదే..
బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషమూ విలువైనదే. స్ట్రోక్‌ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడ వచ్చు. 80 శాతం మందికి రక్తనాళాల్లో గడ్డలు కారణంగా బ్రెయిన్‌స్ట్రోక్‌ వస్తుంది. అలాంటి వారికి థ్రోంబలైసిస్‌ ఇంజక్షన్‌ ఇవ్వడం ద్వారా రక్తనాళాల్లో గడ్డలు కరిగించి, మంచి ఫలితాలు సాధిస్తున్నాం.  
– డాక్టర్‌ డి.వి.మాధవీకుమారి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రభుత్వాస్పత్రి, విజయవాడ 

లాంగ్‌ కోవిడ్‌ సిమ్టమ్స్‌ పెరిగాయి 
పోస్టు కోవిడ్‌ రోగులు కొందరు లాంగ్‌ కోవిడ్‌ సిమ్టమ్స్‌ పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నారు. కోవిడ్‌ వైరస్‌ కారణంగా రక్తనాళాలు దెబ్బతిని, వాటిలో గడ్డలు ఏర్పడి  బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటుకు గురవుతున్న వారిని చూస్తున్నాం. ఒక సారి స్ట్రోక్‌ వచ్చిన వారికి మళ్లీ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. అలాంటి వారు మధుమేహం, రక్తపోటు, కోలస్ట్రాల్‌ స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్‌ డి.అనీల్‌కుమార్, న్యూరాలజిస్ట్‌   

మరిన్ని వార్తలు